Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంబంధిత వర్గాలతో చర్చించకుండా ముందుకు వెళ్లొద్దు : ఐఎన్‌ఎస్
న్యూఢిల్లీ : ఐటీ నిబంధనావళికి సవరిస్తూ మోడీ సర్కార్ విడుదల చేసిన ముసాయిదా ప్రతి మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మోడీ సర్కార్ చర్యను 'ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ' (ఐఎన్‌ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపాదిత సవరణలను వెంటనే నిలుపుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఏకపక్షంగా నిబంధనల్లో మార్పులు చేయరాదని, సంబంధిత వర్గాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు తెలిపింది. ఐటీ చట్టాన్ని సవరిస్తూ మోడీ సర్కార్ కొద్ది రోజుల క్రితం ముసాయిదా ప్రతిని సిద్ధం చేయగా, దీనిపై మీడియా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏదైనా వార్తను 'ఫేక్' అని నిర్ధారిస్తే..సామాజిక మాధ్యమాలు, వార్తా వెబ్‌సైట్స్ ఆ వార్తను ప్రచురించడానికి వీల్లేదని ముసాయిదా చట్టంలో నిబంధనల్ని చేర్చారు. ప్రభుత్వ వ్యవహారాలు, ఇతర సమాచారం గురించిన నివేదికల వాస్తవ కచ్చితత్వాన్ని, అత్యున్నత ప్రమాణాలు, సరైన ప్రక్రియకు అనుగుణంగా ఉండేలా ఒక యంత్రాంగాన్ని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు ప్రారంభించాలని ఐఎన్‌ఎస్ అభిప్రాయపడింది. ఐటీ నిబంధనావళికి సవరణలు చేయటాన్ని 'ఎడిటర్స్ గిల్డ్', ప్రెస్ అసోసియేషన్, డిజిపబ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్, డిజిటల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించాయి. వివాదాస్పద అంశాల్ని ముసాయదా చట్టం నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అన్నది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నోడల్ ఏజెన్సీ. ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయటం పీఐబీ ప్రధాన విధి. ఇలాంటి సంస్థకు నకిలీ వార్తలను తొలగించే పని అప్పగించడాన్ని ఏకపక్ష నిర్ణయంగా ఐఎన్‌ఎస్ భావిస్తోంది.
గతవారం కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి సవరణలు చేసి ముసాయిదా ప్రతిని జారీచేసింది. పీఐబీలోని ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌కు 'నకిలీ వార్తల'ను గుర్తించే పని అప్పగించింది. ఇలా గుర్తించిన వార్తల్ని సోషల్‌మీడియా, న్యూస్ వెబ్‌పోర్టల్స్ ప్రచురించరాదు. ఒకవేళ ప్రచురిస్తే.. వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీ అయిన పీఐబీకి న్యాయ అధికారం కల్పించటాన్ని ఐఎన్‌ఎస్ తప్పుబట్టింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే ప్రభుత్వ చర్యగా అభివర్ణించింది. ముసాయిదా చట్టంలో పేర్కొన్న నిబంధనలు, ఇతర విషయాలు పత్రికల స్వేచ్ఛకు విఘాతమని తెలిపింది.