Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఎత్తులను చిత్తు చేస్తున్నాం.. దీనికి క్యూబా ప్రజల ఐక్యతే బలం
- అలైదా గువేరా, ఎస్తెఫానియాకు ఢిల్లీలో ఘనస్వాగతం
న్యూఢిల్లీ: చే గువేరా మానవత్వం కోసం నిలిచారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. వర్ణం, భాష, సంస్కృతి మొదలైన భేదాలు ఉన్నా మనం ఒక్కటే అనే మానవతా భావం ఉండాలని అన్నారు. ప్రపంచంలో ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం కోసం నిలబడాలని క్యూబా విశ్వసిస్తుందని నొక్కి చెప్పారు. చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తెఫానియాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం నాడిక్కడ హరి కిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో జాతీయ క్యూబా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభ జరిగింది. వందలాది మంది 'చే' అభిమానులు విప్లవ గీతాలు ఆలపిస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మలయాళీలతో సహా చాలా మంది విద్యార్థులు సూర్జీత్ భవన్కు వచ్చి 'చే' కూతురు, మనవరాలిని కలుసుకుని పలకరించారు.
జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు ఐషీఘోష్ పుష్పగుచ్ఛాన్ని అలైదా గువేరాకు అందజేశారు. ఈ సందర్భంగా అలైదా కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా నిషేధం కారణంగా క్యూబా అనుభవిస్తున్న సవాళ్లను వివరించారు. క్యూబా అమెరికాతో పోరాడగలుగుతోందనీ, దానికి కారణం ఒక్కటేననీ, క్యూబా ప్రజల ఐక్యత వల్లనే అని ఆమె నొక్కి చెప్పారు. అందుకే క్యూబా ప్రజల ఐక్యతను నాశనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కొవడానికి, అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి క్యూబా భారీ ఖర్చులను చేయాల్సి వస్తుందని అన్నారు. క్యూబాకు సహకరించే అన్ని దేశాలు, వాణిజ్య సంస్థల పట్ల అమెరికా శత్రు వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. క్యూబాకు సరఫరా చేసే నౌకలపై కూడా యునైటెడ్ స్టేట్స్ నిషేధం విధించిందని తెలిపారు. అయితే అమెరికా బెదిరింపులను పట్టించుకోకుండా క్యూబాకు సహకరించే దేశాలు ఉన్నాయనీ, క్యూబా ఆ దేశాలు, సంస్థల పట్ల విధేయతగా ఉంటుందన్నారు. క్యూబా వైద్యులు ఏ దేశానికైనా, ఏ సమయంలోనైనా సేవ చేస్తారని అన్నారు. అమెరికా భయంతో ఐదేండ్ల చిన్నారికి సులువుగా దొరికే మందు ఇవ్వడానికి ఏ దేశం సిద్ధంగా లేదని ఆమె చెప్పారు. 'ది వైర్' ఎడిటర్, ప్రముఖ పాత్రికేయుడు సిద్ధార్థ్ వరదరాజన్ మాట్లాడుతూ జీ-20కి అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలనీ, క్యూబాపై అప్రజాస్వామిక, అమానవీయ ఆర్థిక ఆంక్షలను ముగించే ప్రతిపాదనను తీసుకురావాలని అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ క్యూబా పట్ల సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ క్యూబాకి భారతదేశం అండగా ఉండాలన్నారు. ఆర్జేడి ఎంపీ మనోజ్ ఝా, క్యూబా రాయబారి అలెజాండ్రో సిమాన్కాస్, నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా కన్వీనర్ ఎంఎ బేబి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీయూటీఏ మాజీ అధ్యక్షురాలు నందితా నారాయణ్, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావం
క్యూబా, భారతదేశం మధ్య సంఘీభావాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గుర్తుచేసుకున్నారు. అలీన ఉద్యమంలో నాయకత్వం గురించి పంచుకున్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం అలీన దేశాల సదస్సులో పాల్గొనకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. క్యూబాకి ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామన్నారు.