Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుష్ప వైవిధ్యంపై శాస్త్రీయ అన్వేషణ
న్యూఢిల్లీ : గంగా నదీ పరివాహక ప్రాంతంలో పుష్ప వైవిధ్యంపై శాస్త్రీయ అన్వేషణ చేయటం కోసం 'పతంజలి' సంస్థకు రూ.4.32 కోట్ల ప్రాజెక్టు దక్కింది. కేంద్ర జలశక్తి పరిధిలోకి వచ్చే 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా' (ఎన్ఎంసీజీ) నమామి గంగే కార్యక్రమాన్ని అమలుజేస్తోంది. హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్, పతంజలి ఆర్గానిక్ రీసెర్చ్ సంస్థలకు పుష్ప వైవిధ్యంపై శాస్త్రీయ శోధన ప్రాజెక్టును 'ఎన్ఎంసీజీ' అప్పగించింది. 18 నెలల కాలవ్యవధిలో ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని ఎన్ఎంసీజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మినిట్స్ వివరాలు తాజాగా మీడియాకు విడుదల చేశారు. పుష్ప వైవిధ్యంపై బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవాలని, పాత విషయాలు పునరావృతం కాకుండా సంబంధిత ఏజెన్సీల సహకారం తీసుకోవాలని సమావేశంలో 'ఎన్ఎంసీజీ' నిర్దేశించింది. అంతేగాక డెహ్రడూన్ వద్ద ఉన్న ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఉన్న సమాచారాన్ని వినియోగించుకోవాలని పతంజలికి సూచించింది. ప్రాజెక్టుకు సంబంధించి సంయుక్త అవగాహనా ఒప్పందంపై పతంజలి సంస్థల చైర్మెన్ ఆచార్య బాలకృష్ణ, ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సంతకాలు చేశారు.