Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గుజరాత్ 2002 మత ఘర్షణల్లో కేసుల విచారణ అత్యంత పేలవంగా సాగుతోంది. బహిరంగంగా.. పట్టపగలు వేలాది మంది ముస్లిం మైనార్టీలపై ఆనాడు హత్యాకాండ కొనసాగింది. ఈ ఘటనల్లో అరెస్టయిన నిందితులు..మెల్ల మెల్లగా నిర్దోషులుగా విడుదలవుతున్నారు. తాజాగా 14మంది నిందితులను నిర్దోషులుగా తేల్చుతూ పంచమహల్‌లోని హాలోల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ వారు సరైన ఆధారాలు సమర్పించలేదని కేసును కొట్టేసింది. మత ఘర్షణలు 2002లో జరగగా, కోర్టు విచారణ 18ఏండ్ల తర్వాత మొదలైంది. కోర్టు విచారణ జరుగుతుండగా... నిందితుల్లో ఐదుగురు చనిపోయారు. మిగతా నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపలేదు. నేరం జరిగిన చోట నిందితుల పాత్ర ఉందని నిరూపణ కాలేదు. ఆయుధాలు, పెట్రోల్, కిరసనాయల్ వంటి పదార్థాలు నేరం జరిగిన చోట వాడినట్టు ఆధారాలు లభ్యం కాలేదని కోర్టు తెలిపింది. ఆనాడు మత ఘర్షణల కారణంగా పలు గ్రామాల్లోని ముస్లింలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో డెలోల్ గ్రామానికి చెందిన కొంతమంది ముస్లింలు 'కాలోల్ రిలీఫ్ కేంద్రా'నికి చేరుకున్నారు. రిలీఫ్ క్యాంప్‌కు వచ్చే క్రమంలో తమ కుటుంబ సభ్యులెంతో మంది గల్లంతయ్యారని కొంతమంది ముస్లింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబంపై 150 నుంచి 200మంది దాడికి తెగబడ్డారని మరొక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తానున్న గ్రామంలో దాదాపు 18 మంది ముస్లింలు కనిపించకుండా పోయారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమపై దాడి చేసినవారిని గుర్తిస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 20మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదుచేశారు. గొడ్డలి, కత్తులతో దాడి చేసి అమాయక ముస్లింలను హత్యచేశారని ఆరోపణలు నమోదయ్యాయి. అయితే నిందితులు వాడిన కత్తులు, గొడ్డళ్లు వంటివేవీ కేసు విచారణ జరిపిన పోలీసులు సేకరించలేదు. చార్జ్‌షీట్ 2004లో నమోదైంది. కొంతమంది కనిపించలేదనే కారణంతో నిందితుల్ని దోషులుగా నిర్ధారించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది.