Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్, యూట్యూబ్ లకు ఎంఐబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లలో మోడీపాత్రపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీని కట్టడి చేయడానికి కేంద్రం తన అధికారాలను విస్తృతంగా వినియోగిస్తున్నది. ఈ డాక్యుమెంటరీలోని విషయాలు ప్రజలకు చేరకుండా దానిని దాచేందుకు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా వివాదాస్పద సమాచార సాంకేతిక నిబంధనలు - 2021 (ఐటీ రూల్స్) లోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగిస్తూ ట్విట్టర్, యూట్యూబ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) సదరు సామాజిక మాధ్యమాలను ఆదేశించింది.
''ఇండియా : ద మోడీ క్వశ్చన్''
పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసిన విషయం విదితమే. భారత్‌లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు దీనిని యూట్యూబ్‌లో షేర్ చేశారు. ట్విట్టర్‌లోనూ ఈ డాక్యుమెంటరీ లింకులను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వ్యాప్తిని అడ్డుకోవడానికి మోడీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే డాక్యుమెంటరీకి సంబంధించిన ఈ లింకులను తొలగించాలనీ, భవిష్యత్తు లోనూ ఈ వీడియో అప్‌లోడ్ కాకుండా బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఐటీ నిబంధనల్లోని ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించి ట్విట్టర్‌కు నిషేదాజ్ఞలు జారీ చేసినట్టు ఎంఐబీ సీనియర్ సలహాదారు ఒకరు ధ్రువీకరించడం గమనార్హం. ఈ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఉల్లంఘించినట్టయితే భారీ జరిమానాతో పాటు ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీంతో కేంద్రం ఆదేశాలను ట్విట్టర్, యూట్యూబ్ లకు చెందిన అధికారులు పాటించారు. అయితే, కేంద్రం ఆదేశాలకు సంబంధించిన అధికారిక కాపీ లేదా పత్రికా ప్రకటనా ఎంఐబీ నుంచీ కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇప్పటికీ విడుదల కాలేదు.
ఈనెల 17న బీబీసీ డాక్యుమెంటరీ
'' ఇండియా : ద మోడీ క్వశ్చన్''
రెండు భాగాల్లో ఒక భాగం యూకేలో ప్రసారమైంది. తొలి ఎపిసోడ్‌లో మోడీ తొలినాళ్లలో రాజకీయ జీవితాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా, 2002 లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో రెండు వేల మంది మరణించడంపై ప్రశ్నలను తొలి ఎపిసోడ్ లేవనెత్తింది. బ్రిటీషులోని అంతర్గత నివేదికల ఆధారంగా దీనిని రూపొందించినట్టు బీబీసీ వెల్లడించింది. 2002లో హింసాత్మక పరిస్థితులు తలెత్తడానికి నేరుగా మోడీనే బాధ్యుడని బ్రిటీషు విదేశీ కార్యాలయ నివేదిక పేర్కొన్నది.