Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 రాష్ట్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
- హర్యానాలోని జింద్‌లో భారీ కిసాన్ మహాపంచాయత్‌కు సన్నాహాలు
న్యూఢిల్లీ: రైతుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు (గురువారం) దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ట్రాక్టర్స్ మార్చ్ నిర్వహించనున్నది. రైతులు జాతీయ జెండాను ఎగురవేసిన తరువాత ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, సమావేశాలను నిర్వహించనున్నట్టు ఎస్కేఎం తెలిపింది. దేశవ్యాప్తంగా 300 జిల్లాలను కవర్ చేస్తూ 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. చారిత్రాత్మక రైతు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తామని తెలిపింది. జిల్లా కలెక్టర్లకు మెమోరాండం అందజేస్తామని పేర్కొంది. జనవరి 26న హర్యానాలోని జింద్‌లో రైతుల భారీ కిసాన్ మహాపంచాయత్ జరగనున్నది. ఎస్కేఎం ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు 2021 జనవరి 26న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎస్కేఎం బట్టబయలు చేస్తుంది. కిసాన్ ఐక్యత బలమైన ప్రదర్శనలో మహాపంచాయత్ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొంది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ఫాసిస్ట్, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మహాపంచాయత్ ఒక ధృఢమైన సందేశాన్ని పంపుతుందనీ, అదే సమయంలో రైతుల సమస్యలను కూడా లేవనెత్తుతుందని ఎస్కేఎం తెలిపింది.
రైతు హంతకుడైన ఆశిష్ మిశ్రాకు బెయిలా..?
ఎస్కేఎం దిగ్భ్రాంతి
లఖింపూర్ ఖేరీ వద్ద పట్టపగలు తన వాహనంతో నలుగురిని హతమార్చిన కేంద్రమంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు ఎనిమిది వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే ఆశిష్ మిశ్రా విడుదలైన వారంలోపు యూపీ వదిలి వెళ్లాలనీ, ఢిల్లీ, యూపీల్లో ఉండకూడదని ఉత్తర్వు నిర్దేశించడం కొంత ఓదార్పునిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఎస్కేఎం ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రైతులను చంపేస్తానని మంత్రి బెదిరించడంతోపాటు... రైతులను హత్య చేయడం హింసాత్మక చర్య అని పేర్కొంది. మిశ్రా అధికార బీజేపీకి అనుబంధంగా ఉన్న శక్తివంతమైన రాజకీయ నాయకుడు, ఆయన విడుదల సాక్షులను బాగా భయపెడుతున్నదనీ, విచారణను ప్రమాదంలో పడేస్తుందని ఎస్కేఎం ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వం ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయడం, అభియోగాలు మోపడం పట్ల మృదువుగా వ్యవహరిస్తోందనీ, చివరికి సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు, చర్యకు ఆదేశించాల్సి వచ్చిందని గుర్తుంచుకోవాలని సూచించింది. మిశ్రా న్యాయాన్ని ఎలా దారి మళ్లిస్తాడో, తప్పుదోవ పట్టిస్తాడో ఊహించవచ్చని పేర్కొంది. లఖింపూర్ ఖేరీ దోషులను త్వరగా శిక్షించాలని, అజరు మిశ్రా టేనిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తునే ఉన్నదనీ, కాని ఈ రెండూ నెరవేరలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని మరింత పొడిగించకూడదని కోరింది. ఆశిష్ మిశ్రా, ఆయన తండ్రి అజరు మిశ్రా సమాజానికి ముప్పు అని పేర్కొంది. లఖింపూర్ ఖేరీ ఘటనలో జైల్లో మగ్గుతున్న అమాయక రైతులకు శాశ్వత బెయిల్ మంజూరు చేయాలనీ, వారిపై పెట్టిన నకిలీ కేసులను ఉపసంహరించుకోవాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.