Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులపై రాళ్లు..గాజు ముక్కలతో హిందూత్వ శక్తుల దాడి
- బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన అడ్డుకునేందుకు రాత్రంగా కరెంట్ కట్..
- జామియా మిలియాలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు అరెస్టు
న్యూఢిల్లీ: గుజరాత్ 2002నాటి అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా మోడీ సర్కార్ అణచివేత చర్యలకు దిగుతోంది. వివిధ వర్సిటీల్లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనలను జీర్ణించుకోలేకపోతోంది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో డాక్యుమెంటరీ చూస్తున్న వందలాది మంది విద్యార్థులపైకి రాళ్లు, గాజు ముక్కలతో దాడి జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలు ఈదాడికి తెగబడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ ప్రదర్శన చేపట్టగా, డాక్యుమెంటరీ ప్రసారమవుతుండగా...మధ్యలో పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని నిలిపివేశారు. మంగళవారం రాత్రి డాక్యుమెంటరీ ప్రదర్శనకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం పిలుపునివ్వగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని వర్సిటీ యాజమాన్యం, పోలీసులు బెదిరింపులకు దిగారు. ప్రదర్శన ముగిసిన తర్వాత రాత్రి 10.40 గంటల సమయంలో కమ్యూనిటీ సెంటర్ వద్ద గుమికూడిన విద్యార్థులపై రాళ్లదాడి జరిగింది. హాజరైనవారి పైకి పగిలిన అద్దాల్ని విసిరేశారని మీడియాలో వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. వర్సిటీ యాజమాన్యం మంగళవారం రాత్రంతా విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ప్రధాన గేట్లతో సహా అనేక చోట్ల దారుల్ని పోలీసులు మూసేశారు. అయినప్పటికీ వర్సిటీలో క్యాంపస్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన డాక్యుమెంటరీ ప్రదర్శనకు వందలాది మంది విద్యార్థులు హాజరుకావటం విశేషం.
తమ మొబైల్ ఫోన్లలో, ల్యాప్‌ట్యాప్స్‌లో డాక్యుమెంటరీని విద్యార్థులంతా చూశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు ముందు జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ ప్రసంగించారు. ''డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఫై, విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. అయినా మన కార్యక్రమం ఆగిపోదు'' అని చెప్పారు. ''కార్యక్రమం జరగకుండా వర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయటం పిరికిచర్య. అన్ని రకాల భావాలపై చర్చించే వేదికగా ఈ వర్సిటీకి పేరుంది. అయితే ఇప్పుడు వర్సిటీ యాజమాన్యం వ్యవహరించిన తీరు విద్యాసంస్థ ప్రతిష్టను దెబ్బతీసింది''అని ఒక విద్యార్థి అన్నారు.
చూడొద్దు..అంటూ నోటీసు
డాక్యుమెంటరీ చూడొద్దు, ప్రదర్శనలో పాల్గొనద్దు..అంటూ సోమవారం నాడు జేఎన్‌యూ యాజమాన్యం విద్యార్థులను బెదిరించింది. జేఎన్‌యూఎస్‌యూ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అనుమతులు లేవని పేర్కొంది. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి కమ్యూనిటీ సెంటర్ వద్ద జరిగిన రాళ్లదాడి, గాజుపెంకల దాడి..ఏబీవీపీ కార్యకర్తల పనేనని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) ఆరోపించింది. దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా గళమెత్తుతారని, ప్రజాస్వామిక గొంతు వినిపిస్తారని ఒక ప్రకటనలో ఏఐఎస్‌ఏ తెలిపింది.
జామియా మిలియా
బుధవారం ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం వర్సిటీ ప్రధాన గేటును మూసేసిన పోలీసులు, విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో గేటు వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఫతేపూర్ బేరిలోని క్యాంపస్‌కు 20 కి.మీ దూరంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేయటం ఏంటని 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' (ఏఐఎస్‌ఏ) ప్రశ్నించింది. అరెస్టయిన కార్యకర్తల మొబైల్ ఫోన్లను పోలీసులు లాక్కున్నారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తు న్నామని ఏఐఎస్‌ఏ ఒక ప్రకటన జారీచేసింది. అరెస్టు చేసిన విద్యార్థుల్ని పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో బుధవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో డాక్యు మెంటరీ ప్రదర్శన చేపట్టగా, డాక్యుమెంటరీ ప్రసారమవుతుం డగా...మధ్యలో పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని నిలిపివేశారు.