Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శన
- కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శనకు ఎబివిపి యత్నం
హైదరాబాద్ : ఎబివిపి విద్యార్ధి సంఘం కవ్వింపు చర్యలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్‌సియు)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం గణతంత్ర దినోత్సవం రోజున ఎబివిపి నాయకులు వర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా క్యాంపస్‌లో కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శనకు ప్రయత్నించడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, పలువురు విద్యార్ధులు అభ్యంతరం తెలిపారు. దీంతో క్యాంపస్‌లో గందరగోళం నెలకొంది. హెచ్‌సియు వైస్ ఛాన్సలర్ మెతకవైఖరి కారణంగానే ఎబివిపి నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధులు క్యాంపస్‌లో నిరసనకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు వర్సిటీ ప్రధాన గేటు ముందు కూర్చొని విసికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్ అప్ సోషలిజం..డౌన్ డౌన్ క్యాప్టలిజం..అంటూ నినదించారు. కాగా, బుధవారం రాత్రి క్యాంపస్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రధాని మోడీపై బిబిసి రూపొందించిన 'ఇండియా - ది మోడీ క్వశ్చన్' డాక్యుమెంటరీని ప్రదర్శించారు. చలిలో సైతం పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరై తిలకించారు. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యార్ధి సంఘాల నేతలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.