Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాంఛనంగా ప్రారంభించిన కేంద్రమంత్రి నిర్మల
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంచనంగా ప్రారంభించారు. ప్రతీ ఏడాది తరహాలోనే హల్వా తయారు చేసి సిబ్బందికి పంచడం ద్వారా ఈ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్‌లో జరిగే ఈ బడ్జెట్ కసరత్తు సమయంలో ఎంపిక చేసిన ఉన్నతాధికారులు మినహా ఎవరినీ లోనికి, బయటికి పంపించరు. కనీసం కుటుంబ సభ్యులతోనూ ఎలాంటి సంప్రదింపులకు వీలుండదు. ఇందులో పాల్గొన్న అధికారులను పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే ఇంటికి అనుమతిస్తారు. హల్వా కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగ్వత్ కిసన్‌రావు కరడ్, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంతక్రితం రెండు బడ్జెట్‌ల తరహాలోనే 2023-24 బడ్జెట్‌ను కూడా కాగితపురహితంగా విడుదల చేయనున్నారు. బడ్జెట్ రూపకల్పన, ప్రక్రియలో ఫైనాన్స్ సెక్రెటరీ టివి సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపమ్ సెక్రటరీ తూహిన్ కాంత పాండే, రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్ర, సిఇఎ అనంత వి నాగేశ్వరన్, ఇతర ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహారించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం తయారు చేసే బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. గడిచిన నాలుగేండ్లుగా సీతారామన్ వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందిరా గాంధీ తర్వాత ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా సీతారామన్ రికార్డ్‌ను సృష్టించారు.