Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో అంగన్వాడీ వర్కర్ల డిమాండ్
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు
- చలిలో రోడ్ల పైనే మహిళల నిద్ర
- అయినా చలించని ప్రభుత్వం
- డిమాండ్లు నెరవేరే దాకా వెనక్కి తగ్గబోమన్న నిరసనకారులు
బెంగళూరు: తమను టీచర్లుగా వర్గీకరించాలన్న ప్రధాన డిమాండ్‌తో కర్నాటకలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. సీఐటీయూ అనుబంధ వర్కర్లు వేలాది మంది ఈ నిరసనల్లో భాగమయ్యారు. ఈనెల 23 నుంచి వారు నిరసనలో ఉన్నారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కు వద్ద గత రెండు రోజుల నుంచి తీవ్ర చలిలోనే నిద్రిస్తున్నారు. అయితే మహిళలు చలిలో, అర్ధరాత్రుళ్లు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రభుత్వం నంచి ఎలాంటి స్పందనా రాకపోవటం గమనార్హం.
కోలార్ జిల్లాకు చెందిన సీఐటీయూ మండల అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ.. '' అంగన్వాడీ వర్కర్ల విషయంలో చారిత్రక అన్యాయం కొనసాగుతున్నది. కారణం.. వారిని కార్మికులుగా (వర్కర్లు) గుర్తించటం లేదు. మేము చేసేది నిరవధిక దీక్ష. ప్రభుత్వానికి మేము పది డిమాండ్లు పెట్టాము. మా కుటుంబాలను వదిలి మరి మా లక్ష్యాలను సాధించడానికి ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని టీచర్లుగా గుర్తించాలి. గ్రాట్యుటీ చెల్లింపులకు మమ్మల్ని అర్హులు చేయాలి. గౌరవ వేతనాలతో 40 ఏండ్లు పని చేయడానికి మమ్మల్ని మీరు కార్యకర్తలుగా ఎందుకు వర్గీకరించారు?'' అని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో తమపై పని భారం పడుతున్నదనీ, వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని సుజాత అన్నారు. అంగన్వాడీలో పరిమితికి మించి చిన్నారుల సంఖ్య ఉంటున్నదనీ, పుస్తకాల నిర్వహణ, 'పోషణ్' అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేయడం వంటివి అదనపు భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఒక్క గుడ్డుకు రూ. 5 ఇస్తున్నారనీ, మార్కెట్‌కు వెళ్లి గుడ్లను తామే కొనుగోలు చేసి తీసుకురావాల్సి ఉంటుందని.. ఇందుకోసం తమ భర్తలు ఒకరోజు పనిని విడిచిపెట్టుకొని మరీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇది ఆరోజు తమ భర్తలకు వచ్చే ఆదాయాన్ని దెబ్బతీస్తున్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా తమను బూత్ స్థాయి అధికారులుగా నియమించడం పని భారాన్ని పెంచుతున్నదని అన్నారు. మండల స్థాయి సమావేశాలను అధికారులు ఏర్పాటు చేస్తే అక్కడకు తప్పక వెళ్లాల్సి ఉంటుందనీ, దీనికి హాజరు కావడానికి ఆ రోజు అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తే మానసిక వేదింపులకు గురవుతామని తెలిపారు. '' మేము 1500 మందిమి గుల్బర్గా నుంచి వచ్చాము. వేతన సవరణ అనేది మా డిమాండ్‌లలో ఒకటి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు నెలకు రూ. 11,500లు, సహాయకులు దాదాపు రూ. 6 వేల వరకు పొందుతున్నారు'' అని పుష్పవతి తెలిపారు. '' కర్నాటకలో సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ 1994లో గుల్బర్గాలో మొదలైందనీ, ఆ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 120 వచ్చేదనీ, అయితే యూనియన్ పోరాటాలతో గౌరవ వేతనం పెరిగిందనీ, లేకపోతే అది మరింత తక్కువగా ఉండేదని '' అన్నారు.
నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ ) ద్వారా నూతన ప్రీ ప్రైమరీ స్కూళ్లు తెరుచుకుంటాయనీ, దీంతో చివరకు అంగన్వాడీలు తగ్గుతాయని సీఐటీయూ కర్నాటక అధ్యక్షురాలు వరలక్ష్మి అన్నారు. దీనికి బదులు ఎల్‌కేజీ, యూకేజీలను అంగన్వాడీలలో ఏర్పాటు చేయాలనీ, వర్కర్లకు కేవలం ఐసీడీఎస్ కు సంబంధించిన పనులనే అప్పగించాలని తెలిపారు. అలా అయితే వారు ప్రీ ప్రైమరీ విద్యపై చక్కగా శ్రద్ధ పెట్టగలుగుతారని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల హాజరు కూడా సంక్లిష్టంగా ఉన్నదనీ సీఐటీయూ మెమోరాండం పేర్కొన్నది. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్దే వండేలా ఫుడ్ సరఫరాని వికేంద్రీకరణ చేయాలని వివరించింది. అయితే, తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.