Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత స్థాయిలో రైతు ఉద్యమం ఉధృతం
- ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలి : కిసాన్ మహా పంచాయతీలో ప్రకటించిన ఎస్‌కేఎం
- లక్షకు పైగా హాజరైన రైతాంగం
- దేశవ్యాప్తంగా టాక్టర్స్ మార్చ్
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్‌కేఎం మెమోరాండం
న్యూఢిల్లీ : కేంద్రం లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చి, అమలు చేయకుండా వెనక్కి తగ్గిన కీలకమైన సమస్యల సాధన కోసం అఖిల భారత స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వందలాది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చిలో పార్లమెంట్‌మార్చ్ నిర్వహించ నున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 9న కురుక్షేత్రలో జాతీయ స్థాయి ఎస్‌కేఎం సమావేశం నిర్వహి స్తున్నామని తెలిపింది. రైతులకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాల ద్రోహం, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పూర్తి రుణమాఫీ, ఇతర డిమాండ్లకు సంబంధించిన చట్టబద్ధమైన హామీపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్‌కేఎం మెమోరాండం పంపించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల రాజధాను లలో టాక్టర్స్ మార్చ్ నిర్వహించారు. దాదాపు 300 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. వేలాది ప్రాంతాల్లో ప్రదర్శనలు, మార్చ్ లు నిర్వహించారు. హర్యానాలోని జింద్‌లో భారీగా కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఇందులో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ మహా పంచాయత్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎస్‌కేఎం నేత దర్శన్ పాల్ చారిత్రాత్మక రైతు ఉద్యమంలో మరణించిన 700 మందికి పైగా అమరవీరులకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులంతా ఒక నిమిషం మౌనం పాటించారు. ఎస్‌కేఎం నాయకులు జోగేందర్ సింగ్ ఉగ్రహన్, దర్శన్ పాల్, రాకేష్ టికాయిత్, హన్నన్ మొల్లా, విజూ కష్ణన్, అవిక్ సాహా, యుధ్వీర్ సింగ్, అతుల్ కుమార్ అంజన్, ఆశిస్ మిట్టల్ తదితరులు మహా పంచా యత్‌లో ప్రసంగిస్తూ తమ ఐక్యతను మరింత పటిష్టం చేయాలని, బీజేపీ విభజన ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు.ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని ఎస్‌కేఎం నేతలు పిలుపు ఇచ్చారు. లఖింపూర్ ఖేరీ ఘటనతో సంబంధమున్న కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగిం చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలని, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ పాలన వెనుక బలమైన కార్పొరేట్ హస్తం ఉన్నదనీ, రైతుల కష్టాలను తీర్చేందుకు అధికారం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నదని జోగేందర్ సింగ్ ఉగ్రహన్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ పాలన అత్యంత రైతు, కార్మికుల వ్యతిరేక పాలన అని హన్నన్ మొల్లా అన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని, మళ్లీ మళ్లీ చేస్తుందని విమర్శించారు. అందువల్ల, బీజేపీని అధికారం నుంచి పారదోలడానికి ఐక్య పోరాటాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హిందూ, సిక్కు ప్రాతిపదికన తమను విభజించేందుకు బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని భగం చేసినందుకు హర్యానా, పంజాబ్ రైతులకు రాకేష్ టికాయిత్ కృతజ్ఞతలు తెలిపారు.