Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, అంబేద్కర్ యూనివర్సిటీల్లో జేఎన్‌యూ సీన్ రిపీట్
- సెక్షన్ 144 విధింపు.. విద్యుత్ సరఫరా కట్
- మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిషేధిస్తూ ఆదేశాలు
- వర్సిటీ యంత్రాంగాలు, పోలీసుల చర్యలు
- 24 మంది అదుపులోకి.. అయినా వెనక్కి తగ్గని విద్యార్థులు
- వీడియో లింక్‌తో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీక్షణ
న్యూఢిల్లీ : భారత్‌లోని అగ్రస్థాయి విశ్వవిద్యాలయాలైన ఢిల్లీ, అంబేద్కర్ యూనివర్సిటీలలో జేఎన్‌యూ సీన్ రిపీట్ అయింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్‌ను వీక్షించడానికి సిద్ధమైన విద్యార్థులను వర్సిటీ యంత్రాంగాలు, పోలీసులు అడ్డుకున్నారు. బీబీసీ సిరీస్ ప్రదర్శనకు సిద్ధమైన ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు అధిక సంఖ్యలో గుమిగూడటాన్ని, బహిరంగా స్క్రీనింగ్‌ను నిషేధిస్తూ సెక్షన్ 144 ను విధించారు. ఇటు అంబేద్కర్ యూనివర్సిటీలోనూ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సిద్ధమైన వేళ యంత్రాంగం విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.
సెక్షన్ 144 విధింపు.. విద్యార్థుల నిరసనలు
వర్సిటీ యంత్రాంగాల తీరు అక్కడి విద్యార్థుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. రెండు యూనివర్సిటీలలో విద్యార్థులు నిరసనలు చేశారు. నినాదాలు వినిపించారు. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుక పోలీసులు రంగంలోకి దిగారు. వీరిలో చాలా మంది విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు. దీంతో వర్సిటీలో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవడంలో భాగంగా విధించిన సెక్షన్ 144కు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద మరింత మంది గుమిగూడారు. వర్సిటీ యంత్రాంగం ఆదేశాలను వారు నిరసించారు. దీంతో పోలీసులు, యూనివర్సిటీ భద్రతా సిబ్బంది విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించినందుకు 24 విద్యార్థులను నిర్బంధించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు.
పోలీసులు, వర్సిటీ యంత్రాంగాలు తమ అధికార, అంగ బలాన్ని ఉపయోగించి డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని చూసినా.. విద్యార్థులను ఆపలేకపోయాయి. జేఎన్‌యూ లో లాగానే.. డాక్యుమెంటరీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ లింక్‌ను షేర్ చేసుకొని విద్యార్థులు తమ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వీక్షించారు. క్యాంపస్‌లో పబ్లిక్ స్క్రీనింగ్‌ను అనుమతించబడదని ఢిల్లీ యూనివర్సిటీ లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ విద్యార్థులు వారి ఫోన్లలోనే చూడాలనుకుంటే.. అది వారి విచక్షణ అని చెప్పాయి. వర్సిటీలలో అలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదనీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు మోహరింపు భారీగా ఉంటుందనీ, ఒక వేళ ప్రదర్శన (స్క్రీనింగ్) కోసం విద్యార్థులు గుమిగూడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు తాను లేఖ రాసినట్టు, వారు (పోలీసులు) చర్యలు తీసుకుంటారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొక్టార్ రజిని అబ్బి తెలిపారు.ఇటు జామియా మిలియా ఇస్లామియాలో విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల అభ్యర్థన మేరకు తరగతులు బహిష్కరించారు. స్క్రీనింగ్‌కు కొందరు విద్యార్థులు ప్రయత్నించారనీ, యూనివర్సిటీ పూర్తిగా విఫలమైందని వైస్ చాన్సలర్ నజ్మా అక్తర్ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజు విద్యార్థులు తరగతులు బహిష్కరించటం గమనార్హం.
ఈ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రయత్నించిన 13 మంది విద్యార్థులను ఢిల్లీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రకు సంబంధించి బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ '' ఇండియా : ద మోడీ క్వశ్చన్'' భారత్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎస్‌ఎఫ్‌ఐ మొదలుకొని పలు విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను పలు యూనివర్సిటీల్లో జరిపాయి. మరికొన్ని వర్సిటీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో ప్రదర్శించడానికి విద్యార్థి సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. కాగా, ఈ డాక్యుమెంటరీనీ కేంద్రం ఐటీ నిబంధనల్లోని ఎమర్జెన్సీ అధికారాలను ప్రయోగిస్తూ నిషేధం విధించిన విషయం విదితమే.