Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46 స్థానాల్లో లెఫ్ట్ ఫ్రంట్
- 13 చోట్ల కాంగ్రెస్.. స్వతంత్ర అభ్యర్థికి ఒక స్థానం
- పోటీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన మాజీ సీఎం మాణిక్ సర్కార్
- సీపీఐ(ఎం) జాబితాలో 24 మంది కొత్త అభ్యర్థులు
న్యూఢిల్లీ : త్రిపురలో బీజేపీ పాలనకు ముగింపు పలకడానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఒక్కట య్యాయి. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో, సీట్ల పంపకాలపై దాదాపు 14 రోజులుగా వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. 46 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను లెఫ్ట్ ఫ్రంట్ కూటమి శుక్రవారం ప్రకటించింది. 13 స్థానాల్ని కాంగ్రెస్‌కు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడుతున్న మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది పురుషోత్తమ్ రే బర్మన్‌కు కేటాయించారు. ''మొత్తం 46 స్థానాల్లో వామపక్ష అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఇందులో 43 స్థానాల్లో సీపీఐ(ఎం), ఒక్కో స్థానంలో సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడతారు'' అని లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ నారాయన్ కార్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల అభ్యర్థుల పేర్లను ఇంకా విడుదల చేయాల్సి వుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సబ్రూమ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలబడుతున్నారు.
మాజీ సీఎం మాణిక్ సర్కార్, బాదల్ చౌదరి, మాజీ మంత్రి భన్సూలాల్ సాహా, సాహిద్ చౌదరీ, తపన్ చక్రవర్తి, సహా 8మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీపీఐ(ఎం) పార్టీ టికెట్లు దక్కలేదు. కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సీనియర్ నాయకులు మాణిక్ సర్కార్ పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో 24 మంది కొత్త అభ్యర్థులకు లెఫ్ట్ ఫ్రంట్ టికెట్లు ఇవ్వటం గమనార్హం. ఇందులో ఇద్దరు మహిళా అభ్యర్థులున్నారు. ఈ సందర్భంగా నారాయన్ కార్ మాట్లాడుతూ, ''ఈ ఎన్నికలు ఈ దేశానికి ఎంతో కీలకమైనవి. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలనే బీజేపీ ధ్వంసం చేస్తోంది. అరాచక, హింసాయుత పాలనకు వ్యతిరేకంగా వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఒక్కటయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ తమ పోరాటాన్ని కొనసాగిస్తాయి. బీజేపీ పాలనకు ప్రజాస్వామ్యయుతంగా ముగింపు పలకాలంటే ఎన్నికలు మంచి అవకాశం. మళ్లీ బీజేపీకి అధికారం రాకూడదనేది మా ప్రధాన లక్ష్య''మని చెప్పారు.