Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోర్బీ బ్రిడ్జి కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు
గాంధీనగర్ : గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన కేసులో 1,262 పేజీల చార్జిషీటును పోలీసులు సిద్ధం చేశారు. పరారీలో ఉన్న ఒరెవా గ్రూప్ ప్రమోటర్, అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చార్జిషీటులో చేర్చినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. గుజరాత్‌లోని మోర్బీ వంతెన కుప్పకూలడంతో చిన్నారులు సహా 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు నెలల అనంతరం ఈ ఘటనకు సంబంధించి చార్జిషీట్‌ను రూపొందించారు. గతవారం నిందితునిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యిందని.. అయితే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈ నెల 16న బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. నిందితుని కోసం గాలిస్తున్నామనీ, వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని సీనియర్ పోలీస్ అధికారి అశోక్ యాదవ్ తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి మోర్బీ వంతెన మరమ్మతు, నిర్వహణ కాంట్రాక్టును అజంతా బ్రాండ్‌తో గోడగడియారాల తయారీ చేసే కంపెనీ ఒవెరా గ్రూప్‌కు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. పాత కేబుల్స్‌ను మార్చకుండా కేవలం కొద్ది పాటి మరమ్మతుతో ఒవెరా కంపెనీ 2022 అక్టోబర్ 30న బ్రిడ్జీని ప్రారంభించింది.