Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్‌లకు లక్షల కోట్ల అప్పు
- ఎంఎఫ్‌ల రూ.25వేల కోట్ల పెట్టుబడులు
- భారీగా ఇన్వెస్ట్ చేసిన ఎల్‌ఐసి
- ప్రమాదంలో ప్రజల సొమ్ము
న్యూఢిల్లీ : బ్యాంక్‌లు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేసుకున్న ప్రజల సొమ్ము ప్రమాదంలో పడింది. అదానీ గ్రూపు కంపెనీలకు అనేక విత్త సంస్థలు భారీగా అప్పులు, ఈక్విటీల రూపంలో సొమ్మును ఇచ్చి చేతులు కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ''అదానీ గ్రూపు ఎకౌంట్స్ మోసాలు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది.'' అని ఇటీవల అమెరికన్ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 106 పేజీల రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు భారత స్టాక్ మార్కెట్లలో రెండు సెషన్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతం మేర కుప్పకూలాయి. దీంతో ఎల్‌ఐసి సహా ఇతర బీమా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వేల కోట్లు నష్టపోయాయి. ఇదే క్రమంలో బ్యాంక్‌లు ఇచ్చిన లక్షల కోట్ల అప్పులపై అనేక ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదానీ కంపెనీల్లో పెట్టుబడుల వల్ల రెండు రోజుల్లో ఎల్‌ఐసి రూ.18వేల కోట్ల మేర నష్టాలు చవి చూడగా.. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా జారీచేసిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పిఒ పరిమాణంలో ప్రభుత్వ ఒత్తిడితో ఐదు శాతం షేర్లకు ఎల్‌ఐసి బిడ్ వేసిందని సమాచారం. దీనికి ఎల్‌ఐసి రూ.300 కోట్లు కేటాయించనుందని సంకేతాలు వస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారీగా పెట్టుబడులను పెంచుకొంటూ పోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్‌లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి పెంచుకుంది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అంబూజా సిమెంట్, ఎసిసి తదితర అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసి రూ.80వేల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. తాజా పరిణామాలతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మరింత పడిపోతే ఎల్‌ఐసి పెట్టుబడులు కరిగి పోనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2022 డిసెంబర్ ముగింపు నాటికి దేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అదానీ కంపెనీల్లో స్థూలంగా రూ.25,263 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అదానీ గ్రూపులోని ఐదు కంపెనీలకు భారత బ్యాంక్‌లు రూ.81,200 కోట్ల అప్పులు ఇచ్చాయి. మిగితా ఐదు లిస్టెడ్, ఇతర అనుబంధ కంపెనీలకు ఇచ్చిన అప్పుల లెక్కలేదు.
2021-22 ముగింపునకు ముందు మూడేళ్లలో అదానీ అప్పులు రెట్టింపై రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్‌లు ఇచ్చిన అప్పుల్లో 25 శాతం పెరుగుదల ఉంది. అధికార బలంతోనే సులభంగా అప్పులు పొందిందనే అరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన తొమ్మిది మాసాల్లో ఇంకా ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకుందనేది వెల్లడి కావాల్సి ఉంది. అదానీ గ్రూపు కంపెనీల మోసాలపై వస్తున్న ఆరోపణలు రుజువు అయితే.. భవిష్యత్తుల్లో అదానీ సామాజ్య్రం మునిగిపోతే భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర అగాథంలోకి పడిపోనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెబీ దృష్టి..
అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రిపోర్టుపై సెబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అదానీ కంపెనీలు అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల పెరుగుదలలో అవకతవకల కు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టుపై సెబీ నిశితంగా పరిశీలన చేస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. గతేడాది అదానీ గ్రూపు చేసుకున్న ఒప్పందాలపై దృష్టి పెట్టిందని సమాచారం.