Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఎస్‌ఐ కాల్పుల్లో నబా కిశోర్ దాస్ మృతి
- ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి
- నిందితుడు అరెస్టు
భువనేశ్వర్ : ఒడిస్సా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిశోర్ దాస్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఒక ఎఎస్‌ఐ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంట సభ్యులను ఓదార్చారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్‌లో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక గాంధీచౌక్‌కు మంత్రి కిశోర్‌దాస్ వెళ్లారు. అక్కడ ఆయన కారు దిగుతున్న సమయంలో భద్రత కోసం మోహరింపజేసిన ఎఎస్‌ఐ గోపాల్ దాస్ అతి సమీపం నుంచి నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కిశోర్‌దాస్ ఛాతీలోకి తూటాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. ఆయనతో పాటు స్థానిక పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్, ఇంకొక వ్యక్తి గాయపడ్డారు. వెంటనే వారిని ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిశోర్ దాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అంతకుముందు నవీన్ పట్నాయక్ అపోలో ఆసుపత్రికి వెళ్లి మంత్రికి అందుతున్న చికిత్సపై వైద్యులతో సమీక్షించారు. కానీ చికిత్స పొందుతూనే కిశోర్ దాస్ కన్నుమూశారు. ఎఎస్‌ఐ గోపాల్ దాస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దారుణానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. నిందితుడు ఘటనా ప్రదేశంలోనే ఉండిపోయారని, దీనినిబట్టి వ్యక్తిగత కారణాలతోనే ఈ దాడి జరిగివుండవచ్చు నని ప్రాథమికంగా భావిస్తున్నారు.