Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ తీవ్ర విమర్శలు
- మోసాన్ని దాచి పెట్టలేరని వ్యాఖ్య
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అత్యున్నత విచారణ జరపాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుని దోపిడికి పాల్పడుతుందని అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ విమర్శలు గుప్పించింది. అదానీ తన సంపద పెరుగుదలను భారత విజయానికి ముడిపెడుతున్నారని తెలిపింది. హిండెన్‌బర్గ్ గత వారం విడుదల చేసిన నివేదికను అదానీ గ్రూపు ఖండిస్తూ.. పలు వివరణలు ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై హిండెన్‌బర్గ్ సోమవారం తీవ్రంగానే స్పందించింది. అదానీ గ్రూపు సమాధానంతో ఏకీభవించడం లేదని, అసలు చాలా ప్రశ్నలకు సమాధానమే చెప్పలేదని తెలిపింది. జాతీయవాదంతో తాము లేవనెత్తిన ప్రతీ ప్రధాన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కప్పిపుచ్చలేరనీ, మోసాన్ని అడ్డుకోలేరని ఘాటుగా పేర్కొంది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానాలు చెప్పలేదని వెల్లడించింది. మరోవైపు అదానీ గ్రూపు ఇచ్చిన వివరణను ఇన్వెస్టర్లు విశ్వసించలేదు. దీంతో వరుసగా మూడో సెషన్లో కూడా అదానీ కంపెనీల షేర్లు నేల చూపులు చూశాయి. సోమవారం సెషన్లో అమ్మకాల ఒత్తిడితో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.53 లక్షల కోట్లు కరిగిపోయింది.
''భారత జెండాను అడ్డు పెట్టుకుని అదానీ గ్రూపు దేశాన్ని క్రమపద్దతిలో దోచుకుంటుంది. జాతీయవాదం పేరుతో దేశాన్ని కాజేస్తుంది. అదానీ గ్రూపు తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధి, ఛైర్మన్ గౌతం అదానీ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోంది. భారత్ ఓ శక్తివంతమైన ప్రజాస్వామిక దేశం. అది సూపర్ పవర్‌గా ఎదుగుతున్నది. అదే సమయంలో అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతున్నది. కీలకమైన అంశాల నుంచి దృష్టి మళ్లించడానికి అదానీ గ్రూపు ప్రయత్నిస్తున్నది. భారత్‌పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్టు ప్రచారం చేస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదానీ గ్రూపు క్రమపద్దతిలో దోచుకుంటూ.. దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందనేది నిజం. ధనవంతులైనా.. అనామకులైనా ఎవరు చేసిన మోసం ఎప్పటికీ మోసమే అవుతోంది. జాతీయవాదం పేరు చెప్పి అదానీ తమ మోసాలను దాచి పెట్టలేరు.'' అని హిండెన్‌బర్గ్ తీవ్రంగా స్పందించింది.
''గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీకి ఉన్న విదేశీ డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్ వేల కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్నది. ఆ డొల్ల కంపెనీలతోనే షేర్లలో అవకతవకలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతోంది.
మేం సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. వినోద్ అదానీ కంపెనీలకు బిలియన డాలర్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించాం. కాగా.. వీటికి ఏ ఒక్క దానికి అదానీ గ్రూప్ తన 413 పేజీల వివరణలో జవాబు ఇవ్వలేదు. పైగా.. వినోద్ అదానీకి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని.. దాంతో ఆ వివరాలను తాము వెల్లడించలేమని అదానీ గ్రూపు పేర్కొంది.'' అని హిండెన్‌బర్గ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత స్వతంత్రపైనే దాడి : అదానీ
హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఒక్క తమ గ్రూపుపైనే దాడి కాదని.. భారత్ పైన, దేశ స్వతంత్రపైనే దాడి చేసిందని అదానీ గ్రూపు పేర్కొంది. హిండెన్‌బర్గ్ విమర్శలపై అదానీ గ్రూపు 413 పేజీల వివరణ ఇచ్చింది. భారతీయ సంస్థలు, వృద్ధి గాథలు, ఆశయాలపై కావాలనే చేస్తున్న విమర్శలని తెలిపింది. ఎలాంటి పరిశోధనలు లేకుండానే ఆ సంస్థ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అదానీ గ్రూపు సీఎఫ్ఓ జుగ్షిందర్ సింగ్ పేర్కొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీఓకు వెళ్లడానికి ముందు కావాలనే ఈ రిపోర్టును ఇచ్చిందన్నారు.
నిజానిజాలు తెలియాలి : సీపీఐ(ఎం)
అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన పెట్టుబడి పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కోల్‌కత్తాలో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ ప్రక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని అన్నారు. ''సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటినీ కలుపుకొని కేంద్రం ఒక్క ఉన్నత స్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తుంది. విచారణను సుప్రీంకోర్టు రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించాలి. ఈ విచారణ పూర్తి అయి నిజానిజాలు తెలియాలి. దేశ ఆసక్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' అని ఏచూరి పేర్కొన్నారు.