Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులు ఇలా చేయలేరు.. వారికి భయం
- యాత్ర లక్ష్యం నెరవేరింది
- 'భారత్ జోడో' ముగింపు సభలో రాహుల్
- పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక, ప్రతిపక్ష పార్టీల నాయకులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగింపు సభ కాశ్మీర్‌లో జరిగింది. కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా, పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీగా మంచు వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా వేలాది మంది కాంగ్రెస్ అభిమానులు, కార్య కర్తలు, మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కురుస్తున్న మంచులోనే సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ యాత్ర ముగింపు సభ శ్రీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా వందనంతో మొదలైంది. ప్రతికూల వాతారణ పరిస్థితుల్లోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మంచు కురుస్తున్నప్పటికీ రాహుల్‌తో పాటు కాశ్మీర్ అగ్రనాయకులు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలు ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. '' దీనిని (యాత్ర) నేను నా కోసమో లేదా కాంగ్రెస్ పార్టీ కోసమో చేయలేదు. దేశ ప్రజల కోసం చేశాను. ఈ దేశ పునాదిని నాశనం చేయాలన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడటమే మా లక్ష్యం. జమ్మూకాశ్మీర్‌లో ఏ బీజేపీ నాయకుడూ ఈ విధంగా యాత్ర చేయలేడని నేను చెప్పగలను. భయం చేతనే వారు ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేరు'' అని తెలిపారు. కాశ్మీర్‌లో నాపై దాడి జరగొచ్చని నన్ను హెచ్చరించారనీ, కానీ.. ఇక్కడ ప్రజలు నాకు హ్యాండ్ గ్రెనేడ్లు ఇవ్వలేదనీ, ప్రేమతో నిండిన హృదయాలను ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, పీడీపీ, ఎన్‌సీ, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఐయూఎంఎల్ లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర అనేది ఎన్నికల్లో విజయం సాధించడానికి కాదనీ, ఇది ద్వేషానికి వ్యతిరేకం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ ఒక ఆశాకిరణమనీ మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు అన్నారు.
భారత్‌వ్యాప్తంగా చేపట్టిన యాత్ర ముగింపు వేడుకలో భాగంగా 135 రోజుల సుదీర్ఘ కన్యాకుమరీ నుంచి కాశ్మీర్ యాత్రకు గుర్తుగా షెర్-ఇ-కాశ్మీర్ క్రికెట్ స్టేడియం వద్ద కాంగ్రెస్ మెగా ర్యాలీని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి లో భారత్ జోడో యాత్ర ప్రారంభమై 14 రాష్ట్రాలు.. 75 జిల్లాలను కవర్ చేస్తూ కాశ్మీర్‌లో ఆదివారం ముగిసిన విషయం విదితమే. ఈ యాత్రలో రాహుల్ మొత్తం 3500 కిలో మీటర్లు నడిచారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని చేపట్టిన భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని ఆయన అన్నారు.