Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్,ఆప్
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అవినీతే అతి పెద్ద శత్రువు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు. వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందనీ, విధానపరమైన వ్యూహాన్ని సమూలంగా దేశాన్ని పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో నిర్మించాలని ఆకాంక్షించారు. నేడు ప్రతి భారత పౌరుడు ఆత్మ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నా రు. నేడు ప్రపంచం మనల్ని చూస్తున్న తీరు అద్భుతమని తెలిపారు. గతంలో మనం ప్రపంచంపై ఆధారపడే వారమనీ, ఇప్పుడు ప్రపంచమే మనపై ఆధారపడు తోందని చెప్పారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నామని చెప్పారు. పేదరికంలేని దేశాన్ని నిర్మించాలన్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా సంపన్నులు కావాలన్నారు. సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని తెలిపారు. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా భారత దేశం ఎదగాలన్నారు.
అవినీతిపై నిరంతర పోరాటం
ప్రజాస్వామ్యానికి, సాంఘిక న్యాయానికి అతి పెద్ద శత్రువు అవినీతి అని తన ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. అందుకే గత కొన్నేండ్ల నుంచి అవినీతిపై నిరంతర పోరాటం జరుగుతోందన్నారు. అదే సమయంలో నిజాయితీపరులకు గౌరవం దక్కే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, పరారయ్యే నేరగాళ్ళ ఆస్తులను జప్తు చేసేందుకు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్‌ను తన ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తన ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరిగిందని తెలిపారు. అవినీతి రహిత దేశంగా మారే దిశగా భారత్ పయనిస్తోందన్నారు. పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించిన పన్ను రిఫండ్ కోసం గతంలో సుదీర్ఘ సమయం ఎదురు చూడవలసి వచ్చేదని తెలిపారు. నేడు ఐటిఆర్ ను దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే రిఫండ్ పొందగలుగుతున్నారన్నారు. నేడు పారదర్శకతతోపాటు జిఎస్‌టి ద్వారా పన్ను చెల్లింపుదారుల గౌరవ, మర్యాదలకు భరోసా లభిస్తోందని తెలిపారు.
శాశ్వత సంస్కరణలు
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డ్, జన్ ధన్-ఆధార్-మొబైల్ నంబర్ల అనుసంధానం వల్ల నకిలీ లబ్ధిదారులను తొలగించగలిగినట్టు తెలిపారు. అతి పెద్ద శాశ్వత సంస్కరణను అమలు చేశామని చెప్పారు. కొన్నేండ్ల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, డిజిటల్ ఇండియాతో శాశ్వత, పారదర్శక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు.
నిర్ణయాత్మక ప్రభుత్వం వల్ల కలిగే ఫలితాలు
ప్రపంచంలో రాజకీయ అస్థిరత ఎక్కడ ఉన్నా, ఆ దేశాలు పెద్ద ఎత్తున సంక్షోభంలో చిక్కుకుంటాయని ద్రౌపది ముర్ము తెలిపారు. తన ప్రభుత్వం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం ఇతర దేశాలతో పోల్చినపుడు మెరుగైన స్థితిలో ఉందని తెలిపారు.