Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 90 శాతం దేశ ప్రజానీకానికి, తెలుగు ప్రజలకు అన్యాయం చేసేలా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. బుధవారం నాడిక్కడ ఆయన కేంద్ర బడ్జెట్ పై మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి దాదాపు రూ.30 వేల కోట్లు (45 శాతం) తగ్గించారని విమర్శించారు. రైతులు, వ్యవసాయ కార్మికులకు అన్యాయం జరిగిందని అన్నారు. సబ్సిడిలకు భారీగా కోత పెట్టారని పేర్కొన్నారు. ఎరువులకు రూ. 75 వేల కోట్లు తగ్గించారనీ, అందులో ఒక్క యూరియాకే రూ.15 వేల కోట్లు తగ్గించారని తెలిపారు. ఆహార భద్రతకి రూ.90 వేల కోట్లు తగ్గించారనీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు తగ్గించారని విమర్శించారు. సామాన్య ప్రజానీకాన్ని, గ్రామీణ భారతాన్ని విస్మరించారని అన్నారు. రైల్వేకు కూడా కేటాయింపులు పెరగలేదని, కార్పొరేట్లకు పన్ను పెంచలేదని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా బడ్జెట్ లేదని, మహిళల డిపాజిట్లు కార్పొరేట్లకు అప్పగిస్తారని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగిందని అన్నారు. ఆదాయ ఆర్జనలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని తెలిపారు. కర్నాటకలో ఎన్నికలు ఉండటంతో కేటాయింపులు చేశారని విమర్శించారు. విభజన హామీలు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు.. బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన చేపడతాయని అన్నారు.