Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాన్యులపై భారాలు.. సంపన్నులకు రాయితీలు
- 2023-24 కేంద్ర బడ్జెట్ లో నిర్మల మాటలతో మాయ...
- అధిక ధరలు, నిరుద్యోగం, సబ్సిడీలు.. ఊసెత్తని కేంద్రం
- రైతులు, కార్మికులు, మహిళలు, వికలాంగులను పట్టించుకోని బడ్జెట్
- అమృత్ కాలంలో ఇది తొలి పద్దు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- ఏడు అంశాలకు ప్రాధాన్యత అంటూ తీయని మాటలు..
- 2022-23లో ఆదాయం రూ.24.3లక్షల కోట్లే... అయినా రూ.45లక్షల కోట్లతో బడ్జెట్
నేడు దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అధిక ధరలు, వేతనాల కోత, ద్రవ్యోల్బణం.. ప్రధాన సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా మోడీ సర్కార్ 2023-24 బడ్జెట్‌ను తీసుకొచ్చింది. బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్..దేశ ప్రజల్ని తీవ్రంగా నిరాశపర్చింది. రైతులు, మహిళలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రయోజనాలు, మధ్య తరగతి ఇబ్బందులు ఇవేవీ ఈ బడ్జెట్ లెక్కలోకి తీసుకోలేదు. బడా కార్పొరేట్లు నడిపిస్తున్న రుణ సంస్థలకు మాత్రం నిబంధనల్ని సడలించారు. కొత్తగా రూ.15.43 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా, పన్ను ఆదాయం 11శాతం పెరుగుతున్నా...సామాన్యుడికి ఊరట సున్నా. ఎన్నికలున్నాయని కర్నాటకకు ప్రత్యేక కేటాయింపులు చేయటం మోడీ సర్కార్‌కే చెల్లింది. సంక్షేమం, అభివృద్ధి ఊసే లేదు. యువత, మహిళలు, వికలాంగులు, అణగారిన వర్గాలకు మేలు చేసే ముచ్చట ఈ బడ్జెట్‌లో లేదు. పేదలు, వలస కూలీలను ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకానికి నిధుల్ని భారీగా తగ్గించారు.
- ఉపాధి హామీ చట్టానికి తూట్లు..రూ.29,400 కోట్లు తగ్గుదల..
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు పదేండ్లలో భారీ కోత
- మొత్తం బడ్జెట్‌లో 3.20 శాతానికి పడిపోయిన కేటాయింపులు
- వంట గ్యాస్ సబ్సిడీ కేవలం రూ.180 కోట్లు
- పంటల బీమా పథకంలో 12శాతం తగ్గిన నిధుల కేటాయింపు
- గతేడాది రూ.15,500 కోట్లు..ఈ బడ్జెట్‌లో రూ.13,625 కోట్లు
- పీఎం కిసాన్ పథకానికి కోతలే..13శాతం తగ్గిన కేటాయింపులు
- 31శాతం తగ్గిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులు
- ఎరువుల సబ్సిడీ రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.1.75లక్షల కోట్లకు తగ్గింపు
- ఎస్సీ, ఎస్టీ సంక్షేమంలో భారీగా తగ్గిన కేంద్రం వాటా
- గత బడ్జెట్‌లో రూ.1,819 కోట్లు..
ఈసారి రూ.976.86 కోట్లు మాత్రమే..
- మహిళా శిశుసంక్షేమం, పోషకాహారం, భద్రతలోనూ అదే తీరు..
- గతేడాది..రూ.3,512 కోట్లు..ఈ బడ్జెట్‌లో రూ.1,514 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ ప్రసంగం..ఆ తర్వాత వెలువడిన కీలక గణాంకాలను పరిశీలిస్తే..ఏ ఒక్కరికీ ఈ బడ్జెట్ ఊరట కలిగించలేదనే చెప్పాలి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా, ఆందోళనకరంగా ఉందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. 'అమృత్ కాల్' అనే పదాన్ని పదే పదే ఉచ్ఛరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఈ బడ్జెట్ అందులో మొట్టమొదటిగా పేర్కొన్నారు. 'అమృత్ కాల్' అనేందుకు ఈ బడ్జెట్‌లో ఏముందో ఎవ్వరికీ అర్థం కాలేదు. సామాన్యులు, ప్రయివేటు ఉద్యోగులకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలకు అనుకూలించే కేవైసీ, డిజీలాకర్ విధానాల్ని సులభతరం చేశారు.
సమ్మిళత వృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థికరంగం బలోపేతం..ఈ ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న బడ్జెట్‌గా నిర్మలా సీతారామన్ చెప్పారు. సప్తర్షి (సప్త రుషుల) రీతిలోనే ఉందని అభివర్ణించారు. అమృత్ కాలానికి ఇది (2023-24 బడ్జెట్) తొలి పద్దుగా వెల్లడించారు. తీయటి మాటలతో ఊరించటం తప్ప, సబ్సిడీలపై, సంక్షేమంపై మాట్లాడలేదు. గత 9ఏండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని గొప్పలు చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌లో చెప్పేదానికి చేసేదానికి మధ్య తేడాను బయటపెట్టేది 'ద్రవ్యలోటు'. ఇది జీడీపీలో 4.5శాతం దాటనివ్వమని గతంలో చెప్పారు. 2020-21లో 9.3శాతం దాటింది. 2021-22లో 6.9 శాతం, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4శాతం ఉంది. ద్రవ్యలోటు ఓ వైపు ఇలా కనపడుతుంటే 2023-24లో 5.9శాతం ఉండొచ్చునని కేంద్రం చెబుతోంది. వాస్తవానికి 7శాతం దాటుతుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. సవరించిన అంచనాలతో 2022-23లో కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.24.3లక్షల కోట్లు. అలాంటిది 2023-24లో రూ.27.2లక్షల కోట్లు ఉంటుందని ఈ బడ్జెట్ అంచనావేసింది. మొత్తం ప్రభుత్వ వ్యయం రూ.45లక్షల కోట్లు ఉంటుందని పేర్కొంది. సెక్యూరిటీ బాండ్ల అమ్మకాలతో, స్మాల్ సేవింగ్స్, మార్కెట్ నుంచి మొత్తంగా రూ.15.4 లక్షల కోట్లు రుణాలు సేకరించబోతున్నామని తెలిపింది.
ఎడా పెడా కోతలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థికసంవత్సరపు బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు కోతలు పెట్టారు. కరోనా సృష్టించిన సంక్షోభం దేశ ప్రజానీకాన్ని ఇంకా వెంటాడుతూనే ఉందన్న విషయాన్ని కేంద్రం విస్మరించింది. గ్రామీణ భారతానికి ఎంతో కొంత ఆలంబనగా ఉన్న ఉపాధి హామీ పథకంలో కోత పెట్టింది. అర్థాకలితో విలవిలలాడుతున్న కోట్లాది కుటుంబాల కడుపు నింపడానికి చర్యలు చేపట్టడానికి బదులు ఆహార సబ్సిడీని భారీగా కుదించింది. వ్యవసాయం నుండి విద్య, వైద్యం అనేక రంగాలకు పెరుగుతున్న ద్రవ్యోల్భణంతో పోల్చుకున్నప్పుడు అరకొర కేటాయింపులే దక్కాయి.
ఉపాధి హామీ
గ్రామీణ పేద ప్రజలను కష్టకాలంలో ఆదుకునే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంపై బిజెపి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దాడి కొనసాగిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 98,468 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 89,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సవరించిన అంచనాల్లో చూపించారు. పూర్తి స్థాయి లెక్కలు వచ్చే సమయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేవలం 60,000 కోట్ల రూపాయలనే కేంద్రం కేటాయించింది. అంటే, దాదాపుగా 30 వేల కోట్ల రూపాయల కోత!
ఆహార సబ్సిడీ
ఆహార సబ్సిడీలోనూ భారీ కోత పెట్టడం ద్వారా పేదప్రజానీకంపై మరో దాడిని కేంద్ర ప్రభుత్వం చేసింది. వివిధ పథకాల ద్వారా పేదలకు తక్కువ ధరకు సరఫరా చేసే ఆహారం కోసం ఇచ్చే సబ్సిడీలో ఏకంగా 90 వేల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం తగ్గించింది. 2021-22లో ఆహార సబ్సిడీ కోసం 2,88,969 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, 2022-23లో 2,87చ194 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అంచనా! మాంధ్యం ముంచుకొస్తున్న వేళ ఈ మొత్తాన్ని ఇంకా పెంచాల్సిఉండగా 1,97,350 కోట్ల రూపాయలతో సరిపెట్టింది. అంటే 31శాతం కోత!
ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 2022-23లో 2,14,696 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వగా తాజా బడ్జెట్‌లో 1,37,207 కోట్లకు తగ్గించారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ పథకం కింద చేసే సేకరణకూ 72,283 కోట్లు గత బడ్జెట్‌లో కేటాయించగా, తాజా బడ్జెట్‌లో 59,793 కోట్లకు పరిపెట్టారు.
వ్యవసాయం
వ్యవసాయ రంగ కేటాయింపులను కూడా కేంద్రం తగ్గించింది. 2022-23 బడ్జెట్‌లో 1,51,521 కోట్ల రూపాయలను కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1,44,224 కోట్ల రూపాయలనే కేటాయించింది. అంటే 5శాతం కోత పెట్టింది. మొత్తం బడ్జెట్‌లో చూస్తే గత బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి 3.84 శాతం కేటాయింపులు దక్కగా, తాజా బడ్జెట్‌లో 3.20 శాతం నిధులు మాత్రమే దక్కాయి.
ఎరువులు
ఎరువులపై సబ్సిడీని గత బడ్జెట్‌తో పోలిస్తే 50 వేల కోట్ల రూపాయల మేర తాజాబడ్జెట్‌లో కేంద్రం తగ్గించింది. అంటే 22శాతం. 2022-23లో 2,25,520 కోట్ల రూపాయలను ఎరువుల సబ్సిడీ కోసం ఖర్చు చేయగా, తాజా బడ్జెట్‌లో 1,75,100 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. ఫలితంగా వ్యవసాయం మరింత భారంగా మారనుంది.
గృహనిర్మాణం
పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 2021-20లో 90,020కోట్ల రూ పాయలు ఖర్చు చేయగా, తాజా బడ్జెట్‌లో 79,590 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. 2022-23లో 77,130 కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం కోసం వ్యయమైనట్లు అంచనా వేశారు. దానితో పోలిస్తే నామమాత్రంగా కేటాయింపులు పెంచినప్పటికీ, ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ మొత్తం తగ్గుతుంది.
బడ్జెట్ సైజు
మాంద్యం ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వ ఖర్చును గణనీయంగా పెంచాల్సిఉండగా, కార్పొరేట్ రంగ ఒత్తిళ్లకు లొంగి బడ్జెట్ సైజును గణనీయంగా తగ్గించారు. జిడిపిలో 15.33 శాతంగా గత బడ్జెట్ సైజు ఉండగా, తాజా బడ్జెట్ 14.92 శాతానికి పరిమితమైంది.
ఇది దుకాణదారుడి బిల్లు : సుబ్రమణ్యస్వామి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కిరాణా దుకాణం దుకాణదారుడి బిల్లు అని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. నిర్మల పద్దుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఈ రోజు సమర్పించిన బడ్జెటేనా? అని అన్నారు. మంచి బడ్జెట్‌లో లక్ష్యాలు ఏమిటో వెల్లడించాలన్నారు.
బడ్జెట్ నుంచి పంజాబ్ గాయబ్ : పంజాబ్ సీఎం
ఇంతకుముందు వరకు రిపబ్లిక్‌డే నుంచి పంజాబ్ మిస్ అయింది. ఇప్పడు బడ్జెట్‌లో కనబడటం లేదు. సరిహద్దు రాష్ట్రంలో బీఎస్‌ఎఫ్ ఆధునీకరణ, యాంటీ డ్రోన్ సిస్టమ్ కోసం రూ. 1000 కోట్లను అభ్యర్థించాం. అయితే, బడ్జెట్‌లో దీని గురించి ఏమీ మాట్లాడలేదు.
నిరాశ బడ్జెట్ : డీఎంకే ఎంపీ దయానిధి మారన్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపర్చిందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు. రాష్ట్రాలకు పథకాలు ప్రకటించినా.. వాటి బాధ్యత రాష్ట్రాలకే వదిలేశారు.
ఇది మోడీకి 'అమృత్‌కాల్' : ఆప్ ఎంపీ సంజరు సింగ్
ఈ బడ్జెట్ ప్రధాని మోడీకి అమృత్‌కాల్ వంటిదనీ, దేశంలోని సామాన్య ప్రజలకు కాదు. పంటల కనీస మద్దతునూ పెంచలేదు, యువత ఉద్యోగాలు పొందేలా చర్యలూ లేవు.
మళ్లీ దారిద్య్రంలోకి ప్రజలు : పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ
గత 8-9 ఏండ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లాగానే ప్రస్తుత బడ్జెట్ ఉన్నది. పన్నులను పెంచారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ఖర్చు చేయలేదు. పేదరికం నుంచి బయటకు వచ్చిన ప్రజలు మళ్లీ దారిద్య్రంలోకి పడిపోయారు.