Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల్లో రూ.90 కోట్ల కోత
- కేంద్రంపై ఎన్‌పీఆర్‌డీ ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో వికలాంగులకు నిరాశే ఎదురైంది. 'దివ్యాంగజన్' అనే పేరు పెట్టడం మినహా.. వికలాంగులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా విస్మరించారు. గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో వికలాంగులకు కేటాయింపులు ఒక శాతం మాత్రమే పెరిగింది. 2022-23 బడ్జెట్‌లో వికలాంగులకు కేటాయించిన నిధుల్లో రూ.196 కోట్లు వినియోగించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో గత ఏడాది కంటే ఒక శాతం అదనంగా వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించారు. వికలాంగ హక్కుల చట్టం అమలు కోసం గత ఏడాది రూ.240.39 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.150 కోట్లకు దిగజారింది. ఈ ఏడాది రూ.90 కోట్లు కోత పెట్టడంతో ఈ చట్టాన్ని ఏవిధంగా అమలు చేస్తారనే ఆందోళన వికలాంగుల్లో నెలకొంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న వేళ వికలాంగులందరికీ ఉచిత, సార్వత్రిక ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జాతీయ వికలాంగుల పెన్షన్‌కు రూ.290 కోట్లే కేటాయించారు. గత పదేళ్లుగా నెలకు రూ.300గా ఇస్తున్న పింఛను పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్న వేళ.. ఉపాధి సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయివేటు రంగంలో వికలాంగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
నిరసనలకు ఎన్‌పీఆర్‌డీ పిలుపు
వికలాంగులను విస్మరించిన కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. తిరోగమన బడ్జెట్‌కు వ్యతిరేకంగా గొంతు వినిపించాలని తన అనుబంధ సంస్థలకు, ఇతర వికలాంగ హక్కుల సంస్థలను కోరింది.