Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు ఊతం
- సహకారంపై కేంద్రం పట్టు బిగింపు
- ఎంఎస్‌పీ చట్టబద్ధత ఊసే లేదు
న్యూఢిల్లీ:డెబ్బయి శాతం ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. సాగు పద్దులో అన్నింటికీ కోతలు పెట్టింది. సంక్షోభం, ఆపై మాంద్యం ప్రభావంతో సేద్యపురంగం కుదేలవగా, కోవిడ్ విలయం తోడు కావడంతో రైతుల, వ్యవసాయ కార్మికుల, గ్రామీణ ప్రజల జీవనోపాధి దెబ్బతింది. కార్పొరేట్లకు ఎన్ని ఉద్దీపన పథకాలిచ్చినా పారిశ్రామిక వృద్ధి పెరగలేదు. కానీ కోవిడ్ క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నది ఒక్క వ్యవసాయమే. మోడీ ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా ఆ రంగానికి 2023-24 బడ్జెట్‌లో కత్తెర పెట్టింది. మరోవైపు వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు నడుం కట్టింది. విరివిగా ప్రకృతి సేద్యం, డ్రోన్ల వాడకం, స్టార్టప్‌లకు ప్రత్యేక నిధి, సహకారరంగంపై కేంద్ర పట్టు బిగింపునకు మరిన్ని చర్యలు చేపడతామని ప్రకటించింది. ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహానికి 'పిఎం-ప్రణామ్' అనే పథకాన్ని ప్రతిపాదించింది. డెయిరీ, ఫిషరీస్ సహా వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లుగా సర్కారు పేర్కొంది. కాగా బ్యాంక్ రుణాలు వాస్తవ సాగుదారులకు అందట్లేదు.
28 వేల కోట్లు కట్
గత బడ్జెట్‌కు ఇప్పటికి వ్యవసాయానికి రూ.28 వేల కోట్లకుపైన కోత పడింది. 2022-23లో 1,51,521 కోట్లు ప్రతిపాదించారు. అప్పటి మొత్తం బడ్జెట్‌లో 3.84 శాతం. 2023-24లో 1,44,214 కోట్లు అన్నారు. మొత్తం బడ్జెట్‌లో 3.20 శాతం మాత్రమే. మునుపటి కంటే 0.64 శాతం తగ్గింది. తగ్గుదల సుమారు 28 వేల కోట్లు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసేందుకంటూ అమలు చేస్తున్న పిఎం కిసాస్, విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే క్రాప్ ఇన్సూరెన్స్, రైతులకు కనీస మద్దతు ధర, పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ఉపకరించే ఫుడ్ సబ్సిడీ, తిండిగింజల సేకరణ పద్దుకూ కోతలే పెట్టారు. ఎరువుల సబ్సిడీకీ కత్తెరలే. ఎంఎస్‌పి గ్యారంటీకి చట్టబద్ధత కోసం రైతులు ఉద్యమిస్తుండగా బడ్జెట్‌లో ఆ అంశం మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించే ఉపాధి హామీకి నిధులు భారీగా తగ్గించారు. ఆర్‌కెవివై, క్రిషియోన్నతి స్కీంలదీ అదే పరిస్థితి.
కార్పొరేట్- మతోన్మాదం
వ్యవసాయంలో కార్పొరేట్ల జోక్యం, ప్రైవేటు ఆధిపత్యం పెంచే పలు కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. రానున్న రోజుల్లో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం కిందికి తీసుకొచ్చి రసాయన ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తారు. తద్వారా రైతుల ఆదాయాలను సుస్థిరం చేస్తారు. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పిఎం-ప్రణామ్ పథకాన్ని ప్రకటించారు. పైకి సేంద్రీయం అంటున్నా గోవు విసర్జితాలకు అధిక ప్రాధాన్యమిచ్చి మతోన్మాదాన్ని రైతులకు ఎక్కిస్తారు. వ్యవసాయంలో డ్రోన్లను ప్రవేశపెడతారు. కిసాన్ డ్రోన్లను పంటలపై అంచనాలు, భూరికార్డుల డిజిటలైజేషన్, ఎరువులు, పురుగుమందుల పిచికారీ వంటికి ఉపయోగిస్తారు.
సహకారరంగంపై కేంద్ర పెత్తనాన్ని పెంచేందుకు దేశంలోని 63 వేల పిఎసిఎస్‌ల కార్యకలాపాల డిజిటలైజేషన్ కోసం రూ.2,516 కోట్లు ఖర్చు చేస్తారు. భవిష్యత్తులో పిఎసిఎస్‌లను మల్టీపర్పస్ ప్రయోజన కేంద్రాలుగా మారుస్తారు. డెయిరీ, మత్స్య సహకార సొసైటీలను నెలకొల్పుతారు. గ్రామాల్లో స్టార్టప్‌లకు నాబార్డు ద్వారా ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. పత్తి పంట దిగుబడి, నాణ్యత పెంచేందుకు క్లస్టర్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ప్రవేశపెడతారు. నూనెల దిగుమతులు తగ్గించేందుకు నూనెగింజల సాగును, ఆరోగ్యం కోసం చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు.