Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి ఏడాది కేటాయింపుల్లో కోత
- బడ్జెట్‌లో రూ.29,400 కోట్లు తగ్గుదల
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు పదేండ్ల కోత
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ ఉపాధి హామీకి తూట్లు పొడుస్తున్నది. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు స్పష్టం అవుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశ ఓపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీకి నిధుల కేటాయింపులో భారీగా కోత విధించారు. 2021-22 బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.98,467.85 కోట్లు కేటాయించారు. అదే 2022-23లో రూ. 89,400 కోట్లు కేటాయించారు. ఏడాదిలో 9,067.85 కోట్లు తగ్గించారు. ఈ ఏడాది (2023-24) బడ్జెట్‌లో రూ.60,000 కోట్లు కేటాయించారు. ఏడాదిలో రూ.29,400 కోట్లు కేటాయింపు తగ్గింది.
పేదల వంట గ్యాస్ కనెక్షన్లకు కోత
పేదలకు వంట గ్యాస్ (ఎల్‌పీజీ) కనెక్షన్లకు బడ్జెట్‌లో భారీగా కోత విధించారు. 2022-23 లో రూ.8,010 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.1 లక్ష కేటాయించారు. అలాగే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ చేసే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. 2022-23లో రూ.4,000 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత 2023-24లో కెరవలం రూ.180 కోట్లు మాత్రమే కేటాయించారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు పదేండ్లలో భారీ కోత
2022-23లో వ్యవసాయ, అనుబంధ రంగాల కేటాయింపు మొత్తం బడ్జెట్లో 3.84 శాతం ఉండగా, ప్రస్తుత బడ్జెట్ (2023-24)లో అది 3.20 శాతానికి పడిపోయింది. గత పదేండ్లలో ఇదే అతి పెద్ద కోత. గతేడాది కేటాయింపు 1,51,521 కోట్లు ఉండగా, 2023-24 లో అది 1,44,214 కోట్లకు పడిపోయింది. దాదాపు రూ. 7,307 కోట్ల కేటాయింపు తగ్గింది. పంటల బీమా పథకం (పీఎంఎఫ్బివై) కేటాయింపు 12 శాతం తగ్గింది. గతేడాది రూ.15,500 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ.13,625 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్ పథకానికి కేటాయింపు 13 శాతం తగ్గింది. గత బడ్జెట్‌లో రూ.68 వేల కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ.60 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) నిధులు ఏకంగా 31 శాతం తగ్గించారు. గత బడ్జెట్‌లో రూ.10,433 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.7,150 కోట్లు కేటాయించారు. ఈ పథకం క్రింద రాష్ట్రాలకు తమ ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు వికేంద్రీకృతమైన కార్యక్రమాలకు కేంద్రం పెద్ద కోత విధించింది. పీఎం-ఆశా పథకానికి కేటాయింపు రూ. 1 కోటి నుంచి తగ్గిస్తూ ఈసారి రూ.లక్ష మాత్రమే కేటాయించింది. పిఎస్‌ఎస్-ఎంఐఎస్ పథకానికి గతేడాది రూ.1,500 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.1 కోటికి తగ్గించింది.
ఎరువుల సబ్సిడీ తగ్గుదల
గతేడాదిలో ఎరువుల సబ్సిడీకి రూ.2,25,000 కోట్ల కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.1,75,000 కోట్లకు తగ్గించారు. యూరియాకు కేటాయింపులు కూడా రూ.1,18,457.24 కోట్ల నుంచి రూ.1,04,063.18 కోట్లకు తగ్గించారు. మొత్తం బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి కేటా యింపులు కూడా తగ్గింది. 2022-23లో 5.81 శాతం కేటాయింపులు ఉండగా, ప్రస్తుత (2023-24) 5.29 శాతానికి తగ్గాయి.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కోసం కేంద్రం ప్రాయోజిత పథకాల కేటాయింపులు తగ్గాయి. గత బడ్జెట్‌లో రూ.1,819.52 కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.976.86 కోట్లకు తగ్గించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈసారి నిధులు కేటాయించలేదు. మహిళ, శిశు సంక్షేమానికి సంబంధించిన పోషకాహారం, భద్రత, సంక్షేమానికి కేటాయింపులు భారీగా తగ్గించారు. 2022-23లో రూ.3,512.88 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.1,514.32 కోట్లకు తగ్గించారు. యువజన, క్రీడల రంగంలో కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులో కోత విధించారు. స్పేస్ రంగంలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు కేటాయింపులు భారీగా తగ్గించారు.