Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఒక్క మాటా లేదు
- కార్మికులపై దారుణ దాడి
- బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి : నిరసనలు చేయాలని అనుబంధ సంఘాలు, కమిటీలు, ప్రజలకు సీఐటీయూ పిలుపు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ జుమ్లా తప్ప మరొకటి కాదు అని సీఐటీయూ అభివర్ణించింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఐటీయూ జనరల్ సెక్రెటరీ తపన్ సేన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. దేశం ఎదుర్కొంటున్న భయంకర ఆర్థిక పరిస్థితిపై అది (బడ్జెట్) ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2022-23లో జీడీపీ 6.5 శాతానికి తగ్గుతుందని ఆర్థిక సర్వే స్వయంగా అంచనా వేసింది. స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా నాలుగు సంవత్సరాలుగా అధోముఖమైన వృద్ధిని చూస్తున్నది. తయారీ రంగంలో వృద్ధి తగ్గుదల ఉన్నది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంగా ఉండగా.. అది 1.6 శాతానికి తగ్గింది. ఉద్యోగాలు కోల్పోవడం, కార్మికులు, సామాన్య ప్రజల పని, జీవన స్థితి గతులు అధ్వాన్నంగా ఉండటం, ఆందోళనకరమైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఫలితంగా కార్మికులు, సాధారణ ప్రజలు తీవ్ర బాధలను ఎదుర్కొంటున్నారు.
విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి మారకపు క్షీణత, అధిక రుణ జీడీపీ నిష్పత్తి మొదలైన ఆర్థిక సర్వేలో పేర్కొన్న నష్టాలను పరిష్కరించడంలో విఫలమైంది. పెట్రోలియం సబ్సిడీని గత సంవత్సరం సవరించిన అంచనాల నుంచి 75 శాతం తగ్గించటంతో ఇది ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ధరల పెరుగుదల తీవ్రంగా ఉంటుంది.
ఇటీవల విడుదలైన ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం భారత ప్రజలు పరోక్ష పన్నులపై ఆరు రెట్లు ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే ఆహార సబ్సిడీని 29 శాతం, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద వికేంద్రీకృత సేకరణకు 17 శాతం, మధ్యాహ్న భోజనానికి 9.4 శాతం, పోషకాల ఆధారిత సబ్సిడీని 38 శాతం తగ్గించింది. కోవిడ్ విపత్తు నుంచి ప్రజారోగ్య మౌలిక సదుపాయాల విషయంలో మోడీ సర్కారు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని బడ్జెట్ స్పష్టంగా చూపిస్తున్నది. ఆయుష్మాన్ భారత్‌కు కేటాయింపులు 34 శాతం తగ్గించారు. ఎన్‌హెచ్‌ఎంకి కేటాయింపులు గతేడాది కంటే 1 శాతం తగ్గాయి. విద్య సాధికారత పథకానికి కేటాయింపులు గత ఏడాది అంచనాల కంటే 33 శాతం తగ్గాయి. జాతీయ విద్యా మిషన్‌కు నిధులు రెండు శాతం పడిపోయాయి.
అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు వారి వేతనాలు, ప్రయోజనాలలో ఎలాంటి మెరుగుదల లేకుండా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఉపాధి హామీ కోసం కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాల నుంచి 33 శాతం తగ్గించబడ్డాయి. జాతీయ జీవనోపాధి మిషన్‌కూ కేటాయింపులను తగ్గించారు.
మోడీ సర్కారు అత్యధికంగా ప్రచారం చేసుకున్న ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కోసం కేటాయింపులు 65 శాతం తగ్గాయి. బడ్జెట్‌తో కార్మికులపై దారుణమైన దాడి జరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కార్మిక సంబంధిత కేంద్ర పథకాలు, ప్రాజెక్టులపై వాస్తవ వ్యయం రూ. 23,165 కోట్లుగా ఉన్నది. ఈ బడ్జెట్‌లో దానిని దాదాపు సగానికి తగ్గించి కేవలం రూ. 12,435 కోట్లకు చేర్చింది. పెన్షన్ ఫండ్ 4.2 శాతం తగ్గింది.
రైతుల ఆదాయం రెట్టింపు విషయంలో చర్చ నడుస్తున్నప్పటికీ.. పీఎం కిసాన్ కేటాయింపులు 11.76 శాతం తగ్గించబడ్డాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 31 శాతం, కృషి సించారు యోజన కోసం 17 శాతం, క్రిషియోన్నతి యోజన కోసం రెండు శాతం కేటాయింపులు తగ్గాయి. ఎరువుల సబ్సిడీలు గత సంవత్సరం సవరించిన అంచనాల నుంచి 22 శాతం పడిపోయాయి. పంటల బీమా పథకానికి గతేడాది అంచనాల కంటే 12శాతం తగ్గించింది. మైనారిటీల అభివ్దృద్ధికి నిధుల కేటాయింపు 66 శాతం తగ్గింది. మాతృవందన యోజన కోసం కేటాయింపులు రూ. 40 కోట్లు తగ్గించబడ్డాయి. ఎస్సీలకు కేవలం 3.5 శాతం, ఎస్టీలకు 2.7 శాతం కేటాయింపులే జరిగాయి. పీఎస్‌యూలలో పెట్టుబడిని 11 శాతం తగ్గించారు. ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఈలకు కూడా ఇందులో మద్దతు ఏమీ లేదు.
ఈ బడ్జెట్ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, జాతీయ వ్యతిరేక, కార్పొరేటు అనుకూల స్వభావానికి రుజువు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ప్రజలకు ఊరటనిస్తుందని అంతా భావించారు. అయితే, అమృత్‌కాల్ అని పిలవబడే మొదటి బడ్జెట్ ప్రజలకు విషపూరితంగా మారింది. కార్మిక వర్గం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని కమిటీలు, అనుబంధ సంఘాలు, ప్రజలు కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో నిరసనలు నిర్వహించాలి.