Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక నిపుణులు
- మొత్తం కేంద్ర పథకాల నిధుల్లో ఎస్సీ సంక్షేమానికి 8.1శాతం
- గిరిజన సంక్షేమానికి 6 శాతం
- మైనార్టీ సంబంధాల్లో 38శాతం నిధుల కోత
- మొత్తం బడ్జెట్లో మహిళలు, బాలికలకు దక్కింది 4.9శాతం
ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా మోడీ సర్కార్ 2023-24 బడ్జెట్ కేటాయింపులు లేవని ఆర్థిక నిపుణులు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. మొత్తం కేంద్ర పథకాల వ్యయంలో ఎస్సీ సంక్షేమ పథకాల కేటాయింపు 2021-22లో 8.8శాతం కాగా, ఇప్పుడు 8.1శాతమే. 2021-22లో ఎస్టీ సంక్షేమ పథకాల వాటా 5.6శాతం. 2023-24 బడ్జెట్లో పెంచింది పెద్దగా ఏమీ లేదు. సమ్మిళిత అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎలా అద్దం పడుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం రూ.45లక్షల కోట్ల బడ్జెట్లో మహిళలు, బాలికలకు నిధుల కేటాయింపు 4.9శాతం.
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌పై ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. పేదలు, అణగారిన వర్గాల్ని పూర్తిగా విస్మరించారని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం గురించి ఏమాత్రమూ ఆలోచించలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేగాక మహిళలు, మైనార్టీల విషయంలోనూ చెప్పుకోతగ్గ ప్రతిపాదనలు లేవన్నారు. కోవిడ్-19 సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయింది పేదలు, అణగారిన వర్గాలు. సంక్షోభ సమయంలో లాభాలు పోగేసుకుంది బడా కార్పొరేట్లు, అత్యంత ధనికులు. బడ్జెట్లో మోడీ సర్కార్ బడా కార్పొరేట్లకు, అత్యంత ధనికులకు తాయిలాలు ప్రకటించింది. పన్ను ప్రయోజనాలు సరళతరం చేసింది. ఆర్థికంగా ముడిపడిన అనేక నిబంధనల్లో చట్ట సవరణలు చేయబోతున్నట్టు తెలిపింది. దీనిని 'అమృత్ కాల్'గా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఏ ఒక్క వర్గానికీ ఊరట లేదు..
దేశంలో నేడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు పూర్తిచేసుకున్నవారు సైతం గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు పోటీ పడ్డారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేవీ పట్టించుకోకుండా అందమైన మాటలతో, పదాలతో బడ్జెట్‌ను రూపొందించారన్న విమర్శలున్నాయి. ద్రవ్యోల్బణం, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలతో మధ్య తరగతి తీవ్రంగా ప్రభావితమైంది. వారికి ఊరట కలిగించే ఒక్క ప్రకటనా బడ్జెట్లో లేదు. వాస్తవ వేతనాలు కనిష్టస్థాయికి చేరుకోవటంతో అసమానతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని, సమ్మిళిత అభివృద్ధి నమూనాలు ఎంచుకోవాలని 'నిటి ఆయోగ్' 2021లోనే ఒక నివేదిక ఇచ్చింది.''ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సఫాయి కార్మికులు, గిరిజనుల్లో పేదలు ఎక్కువగా ఉన్నారు. వీరికి భారత ఆర్థిక , సామాజిక రంగాలలో చోటు దక్కటం లేదు. ప్రభుత్వ, ప్రయివేటు సేవలు అందుబాటులో ఉండటం లేదు. నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉంది'' అన్నది నిటి ఆయోగ్ నివేదికలోని సారాంశం. ఆర్థిక సంపద విషయంలో జాతీయ సగటు కన్నా దిగువన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గాలున్నాయి. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను 2030 కల్లా సాధిస్తామని భారత్ ఐక్యరాజ్యసమితిలో ప్రకటించింది. ఈ లక్ష్య సాధనలో భారత్ ఎంత వరకు సాధించిందన్న దానిపైనా నిటి ఆయోగ్ ఒక స్కోర్ విడుదల చేసింది. తన వార్షిక నివేదికలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికి 100కు 66 మార్కులు ఇచ్చింది.
అసమానతలు పట్టవా?
దేశంలో అసమానతలు పోవాలన్నా, పేదరికం పోవాలన్నా..సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ విధానాలు తప్ప మరో మార్గం లేదు. తాజా బడ్జెట్ మాత్రం కీలకమైన ఈ అంశాన్ని విస్మరించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన, మైనార్టీ సంబంధాలు, మహిళా శిశుఅభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. ఉదాహరణకు సామాజిక న్యాయం, సాధికారతకు 2021-22లో బడ్జెట్ అంచనాలు రూ.10517 కోట్లు. వాస్తవ వ్యయం రూ.7435 కోట్లే. 2022-23లోనూ 11,922 కోట్లు ప్రకటించి, అందుకు అనుగుణంగా వ్యయం చేయలేదు. తాజా బడ్జెట్లో (2023-24) రూ.12847 కోట్లు కేటాయించింది. ఇలా వికలాంగులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, శిశుఅభివృద్ధికి 2021-22లో కేటాయింపు 24,435 కోట్లు. వాస్తవ వ్యయం రూ.21,654 కోట్లు. 2022-23లో రూ.25వేల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్, 2023-24లో రూ.25544 కోట్లు ప్రకటించింది. నిధుల కేటాయింపులో పెరుగుదల కేవలం 1.1శాతం. మైనార్టీ సంబంధాల శాఖ నిధుల్లో 38.3శాతం కోత విధించారు. 2022-23లో రూ.5020 కోట్లు ప్రకటించి, రూ.2612 కోట్లు వ్యయం చేసింది. ఈ బడ్జెట్లో రూ.3097కోట్లకు పరిమితం చేసింది.
ఎస్సీ, ఎస్టీలకు ఉత్తచేయి
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రకారం అన్ని శాఖల్లో వారికి నిధుల కేటాయింపు ఉండాలి. పాలకులు దీనిని కాగితాలకే పరిమితం చేస్తూ వస్తున్నారు. ఎస్టీ సంక్షేమానికి 2021-22లో కేటాయింపులు రూ.79వేల కోట్లు. కాగా మొత్తం కేంద్ర పథకాల వ్యయంలో ఇది కేవలం 5.6శాతమే. ఎస్సీ సంక్షేమానికి 8.8శాతం వాటా మాత్రమే దక్కింది. ఈ బడ్జెట్లో ఎస్టీ సంక్షేమానికి రూ.1.19 లక్షల కోట్లు కేటాయించింది. మొత్తం కేంద్ర పథకాల వ్యయంలో దీని వాటా 6.1శాతం. ఎస్సీ సంక్షేమానికి రూ.1.59 లక్షల కోట్లు ప్రకటించారు. ఇది మొత్తం కేంద్ర పథకాల వ్యయంలో 8.1శాతం. ప్రస్తుత బడ్జెట్లో ఎస్టీ సంక్షేమం నిధుల్ని 33శాతం పెంచి నట్టు కేంద్రం గణాంకాల్ని చూపింది. రోడ్లు, జాతీయ రహదారుల శాఖ కేటాయి ంపులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇక జెండర్ బడ్జెట్ ప్రకటన అంటూ మహి ళలు, బాలిక సంక్షేమం కోసం ఏదో చేస్తున్నామని కేంద్రం గణాంకాల్ని విడుదల చేస్తోంది. దీని ప్రకారం, 2021-22లో కేటాయింపులు రూ.1.53లక్షల కోట్లు. ఆనాటి మొత్తం బడ్జెట్లో వాటా 4.4శాతమే. ప్రస్తుత బడ్జెట్లో 2.23లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. రూ.45లక్షల కోట్ల బడ్జెట్లో వాటా 4.96శాతం.