Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టుబట్టిన ప్రతిపక్షాలు
- దద్దరిల్లిన పార్లమెంట్
- వాయిదాల పర్వంలో ఉభయ సభలు
అదానీ గ్రూప్ వల్ల ఎల్ఐసీకి జరిగిన నష్టంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు గురువారం పట్టుబట్టాయి. అదానీ 'స్కామ్'పై కాంగ్రెస్, సీపీఐ(ఎం), డీఎంకే, సీపీఐ, టీఎంసీ, ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), బీఆర్ఎస్, ఎస్సీపీ, ఐయూఎంఎల్, ఎన్సీ, ఆప్, కేరళ కాంగ్రెస్ పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు.
న్యూఢిల్లీ : అయితే అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక గురించి చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సహా కొన్ని పార్టీలు ఈ విషయంపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఎంపీ పిఆర్ నటరాజన్‌తో పాటు మరికొంత మంది నోటీసులు ఇచ్చారు. అయితే, ఇందుకు సభాపతి అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాల గంట చాలా ముఖ్యమైందనీ, సభ్యులు అంతరాయం కలిగించొద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు చైర్మెన్ జగదీప్ ధన్ఖర్ సభను ప్రారంభించగా, వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, వి.శివదాసన్, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన సంజరు సింగ్, బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావుతో సహా తొమ్మిది మంది ఎంపీలు అదానీ గ్రూప్ స్టాక్ రూట్, మిలియన్ల కొద్దీ సామాన్యులపై దాని ప్రభావం గురించి చర్చించడానికి సాధారణ బిజినెస్‌ను నిలిపివేయాలని కోరుతూ రూల్ 267 కింద నోటీసులు ఇచ్చారు. నోటీసులు సక్రమంగా లేవని చైర్మన్ జగదీప్ ధన్ఖర్ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లోనే లేచి నిరసనకు దిగారు. ప్రతిపక్షాల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆందోళనల నేపథ్యంలో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.