Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా సిటీ బ్యాంక్ నిర్ణయం
- షేర్లు కొనడానికి దిక్కులేరు
- రూ.8.65 లక్షల కోట్లు ఫట్
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు మోసాలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టును బ్యాంక్‌లు, రెగ్యులేటరీ సంస్థలు విశ్వాసంలోకి తీసుకుంటున్నాయి. అదానీ కంపెనీల బాండ్లు హామీలకు పనికిరావని ఇప్పటికే స్విస్‌కు చెందిన క్రెడిట్ సూస్సె ప్రకటించగా.. తాజాగా అమెరికకు చెందిన సిటీ గ్రూపు బ్యాంక్ అదే తరహా షాక్ ఇచ్చింది. అదానీ కంపెనీలు జారీ చేసిన బాండ్లను తనఖాగా పెట్టుకుని బ్రోకర్లకు అప్పులివ్వలేమని స్పష్టం చేశాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ కూడా అప్రమత్తమయ్యింది. అదానీ గ్రూపునకు ఇచ్చిన అప్పులపై తమకు సమగ్ర వివరాలను ఇవ్వాలని బ్యాంక్‌లను కోరినట్టు రిపోర్టులు వస్తున్నాయి. క్రెడిట్ సూస్సె అదానీ కంపెనీల బాండ్ల విలువను సున్నాగా పేర్కొన్న విషయం తెలిసిందే. ''అదానీ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీల ధరల్లో ఇటీవల భారీ తగ్గుదలను చూశాం. ఆ గ్రూప్ ఆర్థిక పటిష్టంపై ప్రతికూల వార్తలను చూస్తున్నాం. అదానీ జారీ చేసిన అన్ని సెక్యూరిటీలకు తక్షణం అమలులోకి వచ్చేలా రుణ విలువను తొలగించాలని నిర్ణయించాం.'' అని సిటీ గ్రూపు బ్లూమ్‌బర్గ్ న్యూస్‌కు తెలిపింది. ఇప్పటికే తాకట్టు పెట్టుకున్న బాండ్ల స్థానంలో క్లయింట్లు సాధారణంగా నగదు లేదా మరొక్కటి తాకట్టు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే ఆ సెక్యూరిటీలను లిక్విడేట్ చేసుకునే హక్కు విత్త సంస్థలకు ఉంటుందన్నారు.
ఎఫ్‌పీఓ నిధులను తిరిగిస్తాం : అదానీ
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీఓ ద్వారా సమీకరించిన రూ.20,000 కోట్ల నిధులను తిరిగి ఇన్వెస్టర్లకు చెల్లిస్తామని గౌతమ్ అదానీ గురువారం స్పష్టం చేశారు. ఈ ఎఫ్‌పీఓను నిలిపివేయాలని తమ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
కుప్పకూలుతున్న షేర్లు..
అదానీ గ్రూపు పన్ను ఎగవేతలు, అక్రమాలు, మోసాలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ స్టాక్ మార్కెట్లలో పెను ప్రకంపనలు సష్టిస్తోంది. అదానీ గ్రూపు కంపెనీలతో పాటు ఆయా సంస్దలకు రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల షేర్లు కూడా నేలచూపులు చూస్తున్నాయి. అదానీ గ్రూపునపై వస్తున్న ఆరోపణలకు తోడు గ్లోబల్ విత్త కంపెనీల ఆంక్షలతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి. ఈ దెబ్బకు వారం రోజుల్లో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.8.65 లక్షల కోట్లు లేదా 45 శాతం పైగా పతనమయ్యింది. గురువారం సెషన్లో అదానీ కంపెనీల షేర్లన్నీ లోయర్ సర్క్కూట్ను తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ 26.7 శాతం పతనమయి రూ.1,565కు క్షీణించింది. ఓ దశలో 35 శాతం క్షీణించి రూ.1,494 కనిష్ట స్థాయికి దిగజారింది. ఉదయం ఓ దశలో అమ్మేవారే కానీ.. కొనేవారు లేని దుస్థితి నెలకొంది. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ సూచీ 10 శాతం చొప్పున క్షీణించాయి. అదానీ పోర్ట్స్ 6.6 శాతం, అదానీ పవర్ 4.98 శాతం, అదానీ విల్మర్ 5 శాతం చొప్పున నేల చూపులు చూశాయి. ఈ వారం రోజుల్లోనే అనేక సూచీలు ఆల్‌టైం గరిష్ట స్థాయి నుంచి దాదాపు 60 శాతం మేర క్షీణించాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేందుకు గౌతం అదానీ స్వయంగా ప్రకటన జారీ చేసినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు.
మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 224 పాయింట్లు రాణించి.. 59,932కు చేరగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా 6 పాయింట్లు తగ్గి 17,610 వద్ద ముగిసింది.