Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ ఎట్టకేలకు గురువారం విడుదలయ్యారు. నెల రోజుల క్రితం బెయిల్ వచ్చినప్పటికీ మరో రెండు కేసులు ఉండటంతో ఆయన జైలులోనే ఉన్నారు. ఈ క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని లక్నో జైలు నుంచి విడుదలైన అనంతరం కప్పన్ మీడియాతో చెప్పారు. బెయిల్ పొందినప్పటికీ తనను జెయిల్లోనే ఉంచారని.. దానిపై 28 నెలల సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. జైలులో నిర్బంధించటం వల్ల ఎవరికి లబ్ది చేకూరిందో తెలియలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రెండేండ్లు చాలా కఠినంగా గడిచిందనీ, అయినా ఎప్పుడూ భయపడలేదని అన్నారు. రెండేండ్ల క్రితం అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో 20 ఏండ్ల దళిత యువతిపై పెత్తందారీ యువకులు సామూహిక లైంగికదాడికి గురైన విషయం తెలిసిందే. మృత్యువుతో పోరాడుతూ నెలరోజుల అనంతరం ఆమె మరణించింది. కేసును కప్పిపుచ్చేందుకు యోగి ప్రభుత్వం ఆ యువతి మృతదేహానికి అర్ధరాత్రి హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనపై రిపోర్టింగ్‌కు వెళ్లిన కప్పన్‌ను యూపీ పోలీసులు అక్రమంగా నిర్భందించారు.