Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్
న్యూఢిల్లీ : పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ స్పష్టత ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపారు. లోక్‌సభలో వైసిపి ఎంపి వంగా గీత విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపి ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని షెకావత్ పేర్కొన్నారు. భూసేకరణ, పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదని ఆయన తెలిపారు. భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు రూ. 3,779.05 కోట్ల బిల్లులును రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని, వాటిలో రూ.3,431.59కోట్లు చెల్లించామని తెలిపారు. పరిహారం, పునరావాస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఏపి ప్రభుత్వం రూ.2,267.29 కోట్ల బిల్లులు సమర్పించగా, ఇప్పటి వరకు రూ.2,110.23కోట్లు తిరిగి చెల్లించామని షెకావత్ పేర్కొన్నారు.
75.3 కిలో మీటర్ల విశాఖ మెట్రోకు ప్రతిపాదనలు అందలేదు
75.3 కిలో మీటర్ల విశాఖ మెట్రోకు ప్రతిపాదనలు అందలేదని కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌషల్ కిశోరే తెలిపారు. లోక్‌సభ ఎంపి ఎంవివి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ''మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలచే రూపొందిస్తాయి. మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే, అటువంటి ప్రాజెక్టుల ఆమోదం ప్రతిపాదన సాధ్యత, వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో కొరియన్ ఎక్సిమ్ బ్యాంక్ నుండి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడ్‌లో ఆర్థిక సహాయం కోసం రూ. 8,300 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నంలో 42.55 కిలో మీటర్ల పొడవుతో లైట్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనను సమర్పించింది.
అయితే ప్రతిపాదనను పరిశీలించిన తరువాత ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం చేయడంలో కొరియన్ ఎక్సిమ్ బ్యాంక్ విముఖత వ్యక్తం చేసింది. రూ. 15,993 కోట్ల అంచనా వ్యయంతో 75.3 కిలో మీటర్ల పొడవుతో వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్వీకరించలేదు'' అని తెలిపారు. ''అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల కోసం సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్, సమగ్ర మొబిలిటీ ప్లాన్ల తయారీతో సహా వివిధ రవాణా అధ్యయనాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.
ఎపిలో 1,92,290 ఇల్లు నిర్మాణం పూర్తి
2022-23లో ఏపిలో 1,92,290 ఇల్లు నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద 2023 జనవరి 23 వరకు 1,92,290 ఇల్లు పూర్తి అయినట్లు పేర్కొంది. ఇల్లు నిర్మాణానికి రూ.31,622.09 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.17,803.47 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.
కొవ్వాడ అణు విద్యుత్‌పై వెస్టింగ్‌హౌస్‌తో చర్చలు
కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం వెస్టింగ్‌హౌస్ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. వెస్టింగ్‌హౌస్ కంపెనీతో చర్చలు ముగిసిన అనంతరం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఖరారు అవుతాయని మంత్రి వివరించారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు జరిగే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భూసేకరణ, ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందడం, ప్రాజెక్ట్ స్థలంలో భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం వంటి పనులు జరుగుతున్నాయి. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 2,079 ఎకరాల భూమి అవసరం ఉంది. ఇప్పటికి 2061 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఈ భూమిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పేరిట బదలాయించడం కూడా పూర్తయిందని మంత్రి తన జవాబులో పేర్కొన్నారు. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం ఊపుగా జరిగే సమయంలో సుమారు 8 వేల మందికి కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ఉపాధి లభిస్తుంది. ఈ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన అనంతరం ప్రతి యూనిట్లో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లాంట్లలో వచ్చే ఉపాధి అవకాశాలతోపాటు విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం కంట్రాక్టర్లు, వెండర్ల వ్యాపారం వలన జరిగే ఆర్థిక కార్యకలాపాలతో ఇంకా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.
564 మంది విద్యార్ధులకు కెవిపివై ఫెలోషిప్‌లు
కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన (కెవిపివై) పథకం కింద గడచిన 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో 564 మంది విద్యార్ధులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. కెవిపివైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్స్పైర్, ఇన్స్పైర్-షి బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలు చేస్తారని తెలిపారు. కెవిపివై ఫెలోషిప్ కింద 2023-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 1 వరకు 843.80 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన కింద 2019-20లో 17.34కోట్లు, 2020-21లో 20,71 కోట్లు, 2021-22 లో 13.45 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.