Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల్లో 9,79,327 పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021 మార్చి 1 నాటికి 78 మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ల్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అందులో అత్యధికంగా రైల్వే శాఖలో 2,93,943, డిఫెన్స్ లో 2,64,706, హౌం శాఖలో 1,43,536, పోస్టల్లో 90,050, రెవెన్యూలో 80,243, ఆడిట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 25,934 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
12 పెట్రోలియం పీఎస్యూల్లో 5,460 ఖాళీలు..కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీ
దేశంలో 12 పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ యు)ల్లో 5,460 ఖాళీలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ తెలిపారు. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 జనవరి నాటికి దేశంలో 12 పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో 5,460 ఖాళీలు ఉన్నాయని అన్నారు. అందులో ఎగ్జిక్యూటివ్ 3,533 పోస్టులు కాగా, నాన్ ఎగ్జిక్యూటివ్ 1,927 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
రాష్ట్రాల కాలుష్యం నియంత్రణ బోర్డుల్లో 5,873 పోస్టులు ఖాళీ
రాష్ట్రాల, కేంద్ర పాలిత కాలుష్యం నియంత్రణ బోర్డుల్లో 5,873 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 11,956 పోస్టులకు గాను, 5,873 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. అందులో ఆంధ్రప్రదేశ్ కాలుష్యం నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ)లో 182 పోస్టులు, తెలంగాణ కాలుష్యం నియంత్రణ బోర్డు (టీఎస్ పీసీబీ)లో 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
రెండున్నరేండ్లలో మూతపడ్డ 6,222 ఎంఎస్ఎంఈలు
దేశవ్యాప్తంగా రెండున్నరేళ్లలో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 జులై 1 నుంచి 2023 జనవరి 30 మధ్య దేశంలో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని తెలిపారు.