Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు
- బెంగళూరులోని ఐఐఏ పీహెచ్డీ విద్యార్థుల నిరసన
బెంగళూరు : కర్నాటకలోని కేంద్ర విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు మెరుపు నిరసన ప్రదర్శనలకు దిగారు. తమ ఫెలోషిప్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణంతో పెరుగుతున్న ఖర్చుల కారణంగానే తాము ఈ డిమాండ్‌ను చేస్తున్నట్టు చెప్పారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో డిమాండ్ల సాధనకు విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు వచ్చే స్టైఫండ్‌లో రూ. 5 వేలు హాస్టల్ వసతికే కట్ అవుతున్నాయనీ, దీంతో తమ చేతుల్లో మిగిలే కొద్ది పాటి మొత్తంతా నెలంతా గడవటం కష్టంగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు విద్యార్థులైతే పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరిలో చాలా మంది తమకు వచ్చే స్టైఫండ్‌లో కొంత భాగాన్ని తమ వద్ద ఖర్చులకు ఉంచుకొని మిగతా మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు ఇళ్లు గడవటానికి పంపుతున్నారు.
ఎన్నో ఆశలతో.. ఉన్న లక్ష్యాలను అధిరోహించాలన్న లక్ష్యంతో తాము ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చేరామనీ, ఫెలోషిప్‌ల సాయంతోనే తాము ముందుకెళ్లగలమని పరిశోధక విద్యార్థులు తెలిపారు. ''మాది బీహార్. మాది వ్యవసాయ కుటుంబం. అయితే, వ్యవసాయంతో మాకు పూట గడవటమే కష్టంగా మారింది. సాగు నుంచి వచ్చే మొత్తం.. తర్వాత పంటకు తిరిగి పెట్టుబడి పెడతారు. అంతగా లాభం లేదు. అయితే, ఈ సారి వరదల కారణంగా పంట నష్టం ఏర్పడింది. దీంతో వారు (కుటుంబీకులు) నా స్టైఫండ్‌పై ఆధారపడ్డారు. నేను వారికి ప్రతి నెలా రూ. 20 వేలు పంపుతాను. నేను నా ఖర్చుల కోసం నా దగ్గర రూ. 5 వేలు ఉంచుకుంటాను. ఇంత మొత్తంతో ఖరీదైన నగరంలో మనుగడ సాగించటం కష్టం'' అని రెండో సంవత్సరం చదువుతున్న పీహెచ్డీ స్కాలర్ సుశాంత్ కుమార్ (25) ఆందోళన వ్యక్తం చేశారు. ఫెలోషిప్ మొత్తాన్ని పెంచితే, ఇది అందరు పరిశోధక విద్యార్థులు, వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందని నాలుగో సంవత్సరం చదువుతున్న పీహెచ్డీ విద్యార్థి శుభం ఘతుల్ తెలిపారు. కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో స్కాలర్‌షిప్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.