Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
- ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్మికుల మరణాలు, స్థితిగతులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. అధిక మరణ రేటుపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు, విభాగాలకు నోటీసులు పంపింది. ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ ఆదేశించింది.కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఫ్యాక్టరీ అడ్వైస్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ (డీజీఎఫ్ఏఎస్ఎల్ఐ) సమాచారం మేరకు పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ఆర్టికల్ ప్రకారం 2017 నుంచి 2022 మధ్య దేశంలోని నమోదిత పరిశ్రమల్లో రోజుకు ముగ్గురు చనిపోగా, 11 మంది గాయాలపాలయ్యారు. ఫ్యాక్టరీలతో పాటు ఇతర వ్యాపార సముదాయాల్లో కార్మికుల మానవ హక్కులపై ఈ ఆర్టికల్ తీవ్ర ఆందోళనలను లేవనెత్తుతున్నదని కమిషన్ అభిప్రాయపడింది. ఈ విషయంలో కమిషన్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్మిక విభాగాలకు నోటీసులు పంపింది. తమ పరిధిల్లోని ఫ్యాక్టరీలలో కార్మికులు, ఉద్యోగుల యాక్సిడెంట్లు, మరణాలు, గాయాలపాలైనవారికి, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, ఫ్యాక్టరీ చట్టం 1948 కింద ఫ్యాక్టరీ యజమానులపై విచారణ, భద్రతా ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సెక్రెటరీకి కూడా ఎన్హెచ్ఆర్సీ ఈ నోటీసును పంపింది. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీ కార్మికుల విషయంలో మానవ హక్కుల మెరుగుదలకు తీసుకున్న, తీసుకోబోయే చర్యలు, భద్రత, ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2018 నుంచి 2020 మధ్య 3331 మరణాలు నమోదయ్యాయి. ఫ్యాక్టరీ చట్టం 1948 కింద కేవలం 14 మంది శిక్షింపబడటం గమనార్హం.