Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత నియోజకవర్గంలో బీజేపీకి ఎదురు దెబ్బ
- మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ అభ్యర్థి గెలుపు
నాగ్‌పూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సొంత నియోజకవర్గం నాగ్‌పూర్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగో గనార్ పరాజయం పాలయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి సుధాకర్ అడ్బాలే విజయం సాధించారు. ఆరెస్సెస్‌లోని పలువురు కీలక వ్యక్తులతోపాటు, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్న వీస్ కూడా ఈ నియోజవర్గానికి చెందిన వారే అయినప్పటికీ వారి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి పరాజయం పాలవ్వడం గమనార్హం. శివసేన నుంచి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే వర్గం విడిపోయిన తర్వాత జరిగిన కీలక ఎన్నికలో బీజేపీ మద్దతుదారు ఓడిపోవడం చర్చలకు తావిస్తోంది.
రాష్ట్రంలో ఎగువసభ అయిన శాసనమండలిలో.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిందే వర్గానికి, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శాసనమండలిలో మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 7తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానమైన కొంకణ్‌లో అత్యధికంగా 91.02 శాతం ఓట్లు పోలవ్వగా, నాసిక్‌లో అత్యల్పంగా 49.28శాతం ఓట్లు పోలయ్యాయి. ఔరంగాబాద్‌లో 86శాతం పోలింగ్ నమోదైంది. మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.