Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వివాదాస్పద 'మతమార్పిడి నిరోధక' చట్టాలు తీసుకొచ్చిన ఐదు రాష్ట్రాలకు భారత సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్నాటక, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నోటీసులు పంపింది. యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ విషయంలో ఇప్పటికే నోటీసులు జారీ అయిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ద్వారా నడుపబడుతున్న సిటిజెన్స్ ఫర్ పీస్ (సీపీజే) స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) ఉన్నది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేటు సి.యు. సింగ్ వాదించనున్నారు. నిజానికి ఈ చట్టాలకు వ్యతిరేకంగా 2019 డిసెంబర్లోనే పిటిషన్ దాఖలైంది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు ఆర్డినెన్సులను, చట్టాలనూ తీసుకొచ్చాయి. ఐదు రాష్ట్రాలు అలాంటి చట్టాలను తీసుకొచ్చాయి. దీంతో సీపీజే కూడా తన పిటిషన్లో మార్పులు చేస్తూ సదరు రాష్ట్రాలు తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా కొత్త పిటిషన్‌ను వేసింది. ఈ చట్టాలపై దాఖలైన పిటిషన్లపై విచారణకు గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
దేశంలోని హిందూత్వ శక్తులు ఆరోపించే 'లవ్ జిహాద్' సాకుతో దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త 'మత స్వేచ్ఛ' చట్టాలను తీసుకొచ్చాయి. అయితే, ఈ చట్టాలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చారనీ, మతాంతర వివాహాల విషయంలో (హిందూ అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్న సందర్భాలలో) వేదింపులకు ఆయుధంగా దీనిని బీజేపీ పాలిత రాష్ట్రాలు వాడుకుంటున్నాయని సామాజిక విశ్లేషకులు తెలిపారు.
బలవంతపు మతనిరోధక చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉన్నది. అయితే, ఉపాధ్యాయ అదనపు అఫిడవిట్ వెనక్కి తీసుకోబడిందని ఆయన తరఫు లాయర్ వెల్లడించారు. ''భారీ సంఖ్యలో మతమార్పిడులు'' అని పేర్కొంటూ దాఖలు చేసిన అశ్విని కుమార్ పిటిషన్ మైనారిటీల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిందని సుప్రీంకోర్టు బెంచ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ అభ్యంతరాల నేపథ్యంలోనే అదనపు అఫిడవిట్‌ను వెనక్కి తీసుకున్నట్టు అశ్విని కుమార్ తరఫు లాయర్ తెలిపారు.