Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రవాదులతో సంబంధాలున్నాయని ఒప్పుకోవాలని బలవంతపెట్టారు..
- హత్రాస్ లైంగికదాడి ఘటన దృష్టి మరల్చేందుకే ఇదంతా : జర్నలిస్టు సిద్దికీ కప్పన్
- నాపై మోపిన ఆరోపణలకు ఆధారాల్లేవు..
- బెయిల్ లభించటం.. పూర్తి న్యాయం కాదు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ పోలీసులు తనను తీవ్రంగా వేధించారని మలయాళ జర్నలిస్టు సిద్దికీ కప్పన్ ఆరోపించారు. మావోయిస్టు, తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఒప్పుకోవాలని పోలీసులు బలవంత పెట్టారని, ఒప్పుకోకపోయేసరికి తీవ్రంగా కొట్టారని తాజాగా మీడియాతో మాట్లాడుతూ కప్పన్ చెప్పారు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా మీడియాతో మాట్లాడుతూ కప్పన్ పై వ్యాఖ్యలు చేశారు. బెయిల్ నిబంధనల్లో భాగంగా ఆయన ఆరు వారాలు ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది. పోలీస్ కస్టడీలో తాను ఎదుర్కొన్న వేధింపులు, ఇతర విషయాలు మీడియాకు తెలిపారు. కప్పన్పై యూపీ పోలీసులు నమోదుచేసిన కేసులో సెప్టెంబర్ 2022లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. కేంద్రం కప్పన్పై ఈడీ కేసు నమోదుచేసింది. ఆయన కుటుంబం ఎంతో శ్రమకోర్చి చేసిన పోరాటం ఫలితంగా చివరికి ఈడీ కేసులోనూ కప్పన్‌కు బెయిల్ దక్కింది. ఫిబ్రవరి 2న జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తూ, పోలీస్ కస్టడీలో తాను ఎదుర్కొన్న వేధింపుల్ని మీడియాకు వివరించారు.
''పాకిస్తాన్‌కు ఎప్పుడైనా వెళ్లావా? బీఫ్ (ఆవు మాంసం) తిన్నావా? అంటూ అనవసర ప్రశ్నలతో మానసికంగా వేధించారు. పోలీసు కస్టడీలో భయంకరమైన వేధింపులు ఎదుర్కొన్నా. సుప్రీంకోర్టు కలుగుజేసుకొని బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాను. బెయిల్ లభించటంతో పూర్తి న్యాయం దక్కిందని భావించటం లేదు'' అని అన్నారు.
43ఏండ్ల సిద్దికీ కప్పన్ మలయాళ మ్యాగజైన్ విలేకరి. పార్లమెంట్, కాంగ్రెస్, మైనార్టీల వ్యవహారాలపై వార్తలు రాస్తుండేవారు. హత్రాస్‌లో దళిత యువతిపై లైంగికదాడి, హత్య ఘటన రిపోర్ట్ చేయడానికి అక్టోబర్, 2020లో ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కప్పన్‌ను అరెస్టు చేసి, మావోయిస్టు, తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఆరోపణలు నమోదుచేసింది. కేంద్రం మనీ లాండరింగ్ కేసు పెట్టింది. రెండు సంవత్సరాలా నాలుగు నెలలపాటు జైల్లో నిర్బంధించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని కప్పన్ ఖండించారు. ఆరోపణలపై మాట్లాడుతూ, ''హత్రాస్ కేసులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపెట్టడానికి నన్ను బలిపశువు చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికి నాపై లేనిపోని ఆరోపణలు చేశారు. దళిత యువతిపై గ్రామంలోని పెత్తందార్లు అత్యంత పాశవికంగా లైంగికదాడికి తెగబడటమేగాక, హత్య చేశారు. దీనికి మతం రంగు పులిమేందుకు యూపీ సర్కార్ ప్రయత్నించింది'' అని అన్నారు.
ఆధారాల్లేని ఆరోపణలు
నాపై మోపిన ఆరోపణలన్నీ ఆధారాల్లేనివి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), మావోయిస్టు, ఇతర తీవ్రవాద గ్రూపులతో సంబంధాల్లేవు. జర్నలిస్టు ముసుగు వేసుకున్నాడనే ఆరోపణ చేశారు. ఎప్పట్నుంచో కేరళ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్టు సభ్యుడ్ని. గుర్తింపు కార్డుల్ని లాక్కొని, పోలీసులు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. అనవసరమైన ప్రశ్నలతో పోలీసులు వేధించేవారు. అనేకమార్లు కొట్టారు. కాళ్లపై, పాదాలపై తీవ్రంగా కొట్టారు. మావోయిస్టు, తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఒప్పుకోవాలని బలవంతపెట్టారు. అనారోగ్యం పాలైతే సరైన వైద్య చికిత్స దొరకలేదు. చేతికి బేడీలు వేసి హాస్పిటల్లో ఉంచారు. ఏడురోజులు వాష్‌రూమ్‌కు వెళ్లనీయలేదు. ప్లాస్టిక్ బాటిల్లో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది.