Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2,200 మందికి పైగా అరెస్టు...మహిళలపై లాఠీ చార్జీలు
- 'కుటుంబాలు విడిపోతున్నాయి' బంధవుల ఆవేదన
న్యూఢిల్లీ : బాల్య వివాహాల కేసుల్లో అసోంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత దూకుడుగా ముందుకు దూసుకుని వెళుతోంది. బాల్య వివాహాలను నిరోధించడం పేరుతో ఈ కేసుల్లో అమానవీయంగానూ వ్యవహరిస్తోంది. ఈ కేసుల్లో గత రెండు రోజుల్లో 2,200 మందికిపైగా వ్యక్తులను అరెస్టు చేసింది. తమ ఇష్టపూర్వకంగానే వివాహాలు జరిగాయనీ, తమవారిని విడిచిపెట్టాలని మహిళలు చేస్తున్న అభ్యర్థనలను పోలీసులు పట్టించుకోవడం లేదు. పైగా పోలీస్స్టేషన్ల ముందు గుమిగూడుతున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జీకి దిగుతున్న ఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల అరెస్టులతో కుటుంబాలు విడిపోతున్నాయని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్య వివాహాల అణచివేత ప్రణాళికను అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గత నెలలో ప్రకటించారు. 15 రోజుల్లో బాల్యవివాహాలపై 4,004 కేసులను పోలీసులు నమోదు చేశారనీ, ఫిబ్రవరి 3 నుంచి దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ (పోక్సో) చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 కింద ఈ కేసులను నమోదు చేశారు. 14 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై కేసులను నమోదు చేసినట్లు అసోం ప్రభుత్వం చెబుతోంది. బాల్య వివాహం చేసుకున్న వారిని అరెస్టు చేస్తామనీ, వివాహాలు అక్రమమని ప్రకటిస్తామని తెలిపింది. వివాహం చేసుకున్న బాలుడు కూడా 14 ఏండ్ల లోపు వాడైయితే వారిని రిఫార్మ్ హౌస్కు పంపుతామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకూ ఈ కేసుల్లో 2,200 మందికిపై వ్యక్తులను అరెస్టు చేసింది. మైనర్లుగా పెండ్లి చేసుకుని, ఇప్పడు పెద్దలుగా మారిపోయి, కొంత మంది పిల్లలకు తండ్రులు అయిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అలాగే, కుటుంబాల్లో ప్రధాన సంపాదనపరుడైన వ్యక్తిని అరెస్టు చేయడంతో ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరెస్టులపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాల్య వివాహాలపై ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అనేక మంది ప్రశ్నిస్తున్నారు.