Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిల వసూళ్ల కోసమంటూ విజయవాడలో ఉత్తర్వులు
- త్వరలో రాష్ట్రమంతా ఇదే విధానం?
అమరావతి : యూజర్ చార్జీల బకాయిలను వసూలు చేయాలని పేర్కొంటూ వార్డు సచివాలయాల్లో పనిచేసే పలువురు చిరుద్యోగుల సాధారణ సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆర్థిక సంవత్సరం చివర కావడంతో మార్చి 31లోగా నూరు శాతం బకాయిలను వసూళ్లు చేయాలని, అప్పటి వరకు (59 రోజుల పాటు) అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను సాధించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ఉత్వర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అత్యవసరమైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లి సెలవు తీసుకోవచ్చని ఉత్తర్వులలో పేర్కొన్నప్పటికీ అది అందరికీ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో యూజర్ చార్జీల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలాఖరు వరకు ఇదే విధానాన్ని అమలు చేయనున్నారని సమాచారం. ఈ మేరకు ఎక్కడికక్కడ ఉత్తర్వులు జారీ కానున్నాయి. యూజర్ చార్జీలకు సంబంధించి మునిసిపల్‌శాఖ రాష్ట్ర స్దాయిలో గతనెల 18న సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 2022-23 సంవత్సరానికి సంబందించి ప్రతి వార్డు సచివాలయం పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను, చెత్తపన్ను, వాటర్ మీటర్ యూజర్ చార్జీలతో పాటు ప్రొఫెషనల్ ట్యాక్స్్లను నూరు శాతం వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తాజా ఉత్తర్వుల్లోరనూ అదే విషయం పేర్కొన్నట్లు సమాచారం. వసూళ్లకు సంబందించి రెవెన్యూ ఇనెస్పెక్టర్లు, వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు, ఇన్డోర్, ఔట్‌డోర్ సిబ్బంది, క్యాష్ కౌంటర్లలో పనిచేసే సిబ్బందికి విజయవాడలో సెలవులు రద్దు చేశారు. అవసరమైతే సచివాలయంలోని ఇతర సిబ్భందిని కూడా వసూళ్లకోసం వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏకంగా రెండు నెలల పాటు సెలవులు రద్దు చేయడమంటే చిరుద్యోగులను మానసికంగా వేధించడమే అవుతుందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
యూజర్‌ఛార్జీల బకాయిల వివరాలు
మొత్తం అర్బన్ లోకల్ బాడీలు : 40
యూజర్ ఫీజు డిమాండ్ : రూ.263.27కోట్లు
వసూలైంది: 93.32కోట్లు
పర్సెంటీజీ: 33.32శాతం