Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తన నియోజకవర్గంలోని దళితులపై దాడులు పట్టించుకోరా? : వి శ్రీనివాసరావు
భట్టిప్రోలు : దళితులపై దాడులు జరిగితే స్పందించని స్థానిక మంత్రి ఎవరి కోసం పని చేస్తున్నారో చెప్పాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చింతల్లంక, పెదలంక గ్రామాల్లో బాధితులు, పేదల పక్షాన నిలబడి అక్రమ కేసులకు గురై జైలు పాలైన సీపీఐ(ఎం) కొల్లూరు మండల కార్యదర్శి తోడేటి సురేష్ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టులకు కేసులు, జైళ్లు కొత్తేమీ కాదని, వాటికి భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. భూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. దళిత నియోజకవర్గంలో దళితుల సమస్యలు పరిష్కరించాల్సిన స్థానిక మంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం దళితులపై అధికారులతో అక్రమ కేసులు బనాయింపజేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. భూమి కోసం పోరాటం, ధర్నా చేయడం పేదవాడి ప్రాథమిక హక్కని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం కూడా ఆనాడు ధర్నాలు, సత్యాగ్రహాలతోనే వచ్చిందని గుర్తు చేశారు. భూమి కోసం చదును చేస్తూ పిచ్చికంపను తొలగించడం నేరమా? అని ప్రశ్నించారు. సమస్య పరిష్కారంలో తహశీల్దార్ ఉపేక్ష వల్లే దళితులపై అగ్రవర్ణ పెత్తందార్లు పోలీసుల సాక్షిగా దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, ఆర్సి భూములు పేదవాడికి అప్పగించాలని చట్టంలో ఉందని తెలిపారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సురేష్‌ను విడుదల చేసి దాడులకు కారణాలపై తగిన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, సీపీఐ(ఎం) బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ పాల్గొన్నారు.