Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో రుణ యాప్‌ల ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. చైనా మూలాలున్న 138 బెట్టింగ్ యాప్స్, 94 రుణ యాప్‌లలో కొన్నింటిపై నిషేధం, మరికొన్నింటిని బ్లాక్ చేయాలని నిర్ణయించింది. మొత్తం 232 యాప్స్‌పై తక్షణ, అత్యవసర ప్రాతిపదికన ఈ చర్యకు సిద్ధమైనట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఈ నిర్ణయం జరిగిందని, యాప్‌ల నిషేధానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కింద భారత సార్వభౌమత్వం, సమగ్రత పట్ల పక్షపాతంగా వ్యవహరించే ఉద్దేశాలను ఈ యాప్‌లలో గుర్తించడంతో ఈ చర్య తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా లోన్ యాప్‌లు అమాయకులను రుణాల పేరిట దోపిడీకి గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. భారీ వడ్డీ రేట్లు విధిస్తున్నాయి. ఆ వడ్డీలు చెల్లించలేని రుణగ్రస్థులను యాప్‌ల ప్రతినిధులు వేధింపులకు గురిచేస్తున్నారు. పలువురు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది.ఇప్పటికే ఆరు నెలలక్రితం 28 లోన్ యాప్‌లపై కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.