Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ఎమ్మెల్సీలు విఠపు బాల సుబ్రహ్మణ్యం, కెఎస్.లక్ష్మణరావు
- పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా ఒంగోలులో సంఘీభావ సభ
ఒంగోలు : అధికారంలో ఎవరు ఉన్నా బాధితుల పక్షాన నిలబడి పోరాడతామని, తాము ఏ ఒక్క వర్గం పక్షాన ఉండబోమని ఏపీ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కెఎస్.లక్ష్మణరావు అన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డిలకు సంఘీభావంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఆదివారం సభ జరిగింది. ఈ సభకు జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి.గోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సదర్భంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీల ప్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులను గెలవకుండా చేయాలని వివిధ పార్టీలు, అనేక శక్తులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, పట్టభద్రులు, మేథావులు, నేతలంతా సంఘటితమై వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, రామయపట్నం పోర్టును నిర్మించాలని, కనిగిరి నిమ్జ్ ఏర్పాటు చేయాలని, దొనకొండను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేయాలని, జిల్లాలో ప్లోరిన్ సమస్యను పరిష్కరించాలని అనేక సందర్భాలలో మండలి లోపల, బయట పిడిఎఫ్ ఎమ్మెల్సీలు పోరాటాలు చేసినట్లు తెలిపారు. నేడు రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అమ్మేందుకు అడుగులు వేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సమస్యలపై పోరాడేందుకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలను గెలుపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్, రాష్ట్ర నాయకులు కొమ్మోజి శ్రీనివాసరావు, యుటిఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఒవి.వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రవి, ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బిసిహెచ్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.