Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు 30కోట్లమంది దూరం
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, జనవరి 1నాటికి దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 94 కోట్లా 50 లక్షలా, 25 వేలా 694కు చేరుకుంది. దేశ స్వాతంత్య్రం తర్వాత 1951 నాటి ఓటర్లతో పోల్చితే ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. మొదటి సార్వత్రిక ఎన్నికలనాటికి దేశంలో 17.32 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో ఆనాడు 45.67శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికలనాటికి ఓటర్ల సంఖ్య 91.20 కోట్లకు చేరుకుంది. కాగా ఓటింగ్ శాతం 67శాతం నమోదైంది. దాదాపు 30కోట్లమందికిపైగా ఓటర్లు ఓటింగ్‌కు దూరమున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 83.40 కోట్లకు చేరుకుంది. ఇందులో 66.44శాతం మంది ఓటేశారు. ఈ ఏడాది రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటింగ్ శాతాన్ని పెంచే చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు జరుపుతోంది. వలస కార్మికులు, కూలీలు పోలింగ్ సమయంలో ఓటేయలేక పోతున్నారని, 'రిమోట్ ఓటింగ్' సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.