Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాల లీక్‌లో నిందితుడిగా..
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో అవినీతి, కుంభకోణా లకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజ్‌లు అక్కడ సర్వసాధారణంగా మారాయి. సీఎం పుష్కర్‌సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ (జేఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష పేపర్ లీక్ కేసులో బీజేపీ మండల్ ప్రెసిడెంట్ సంజరు ధరివాల్ ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. అతడితోపాటు మరో 9మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంజరు ధరివాల్ మధ్యవర్తిగా వ్యవహరించాడని, ఈ కేసులో నిందితులుగా ఉన్న 9మంది వెనుక రూర్కీకి చెందిన మరో బీజేపీ నాయకుడు ఉన్నాడని తెలిసింది. ఈ కేసు వివరాల్ని ఎస్ఎస్పీ హరిద్వార్ అజరు సింగ్ మీడియాకు తెలుపుతూ, ''పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జేఈ, ఏఈ పరీక్షల్లో ప్రశ్న ప్రతాన్ని లీక్ చేశారన్నది ముఖ్యమైన ఆరోపణ. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముగ్గురు నిందితులు సంజీవ్‌కుమార్, నితిన్ చౌహాన్, సునీల్ సైనీలను అదుపులోకి తీసుకొని విచారణ జరిపింది. పెద్ద మొత్తంలో నగదు ,వివిధ బ్యాంకుల ఖాళీ చెక్కులు వారి వద్ద ఉన్నాయి. ఈ కేసులో బీజేపీ నాయకుడు సంజరు ధరివాల్ పాత్రపై పోలీసులకు పలు అనుమానాలున్నాయి'' అని అన్నారు. ఈ సంగతి మీడియాలో విడుదల కాగానే ధరివాల్ తన పార్టీ పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా ధరివాల్ పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పేపర్ లీకేజీ కేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణంలో అధికార బీజేపీకి చెందిన నాయకులే ఉన్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. తాజాగా పోలీసులు మీడియాకు విడుదల చేసిన పేర్లు కూడా బీజేపీకి చెందినవారివే ఉండటంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పేపర్ లీకేజీతో సంబంధమున్న హకీం సింగ్‌ను అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న తరుణంలో బీజేపీ మండల్ ప్రెసిడెంట్ సంజరు ధరివాల్ పేరు తెరపైకి వచ్చింది. ''ఈ కుంభకోణంలో బీజేపీ నాయకుల పాత్రను తాజా పరిణామం బయటపెట్టింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు ఈ పేపర్ లీకేజ్ కుంభకోణం వెనుక ఉన్నారు'' అని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గరీమా మహారా డాసోని అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 54 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.