Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ డాటా ప్రొటక్షన్ బిల్లులో వివాదాస్పద సెక్షన్లు
- ఈ బిల్లు చట్టంగా మారితే ఆర్టీఐ ఉన్నా లేనట్టే : సమాచార హక్కు కార్యకర్తలు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తీసుకొచ్చిన 'డిజిటల్ డాటా ప్రొటక్షన్ బిల్లు'పై సామాజిక కార్యకర్తలు, సమాచార హక్కు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాటా ప్రొటక్షన్ బిల్లు ద్వారా ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్నదే మోడీ సర్కార్ వ్యూహమని, అందుకోసం ముసాయిదా బిల్లులో వివాదాస్పద సెక్షన్లు పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ డాటా ప్రొటక్షన్ ముసాయిదా బిల్లును చట్టంగా మార్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. దీంతో ఈ అంశం అటు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ముసాయిదా బిల్లులో పేర్కొన్న పలు సెక్షన్లు ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ముసాయిదా బిల్లు ఒకవేళ చట్టరూపం దాల్చితే ఇక ఆర్టీఐ హక్కు ఉన్నా లేనట్టేనని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఆర్టీఐ చట్టం, ఇతర చట్టంలోని అంశాల్ని అతిక్రమిస్తూ డిజిటల్ డాటా ప్రొటక్షన్ బిల్లులోని సెక్షన్ 29(2)ను కేంద్రం రూపొందించింది.
అలాగే ఆర్టీఐలోని పలు నిబంధనల్ని, అంశాల్ని సవరించాలని సెక్షన్ 30(2) ప్రతిపాదిస్తోంది. సమాచార వెల్లడిలో అనేక మినహాయింపులు కల్పిస్తోంది. పౌరుల వ్యక్తిగత, గోప్యతకు ముడిపడిన సమాచారం కోరరాదని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జే) చెబుతోంది. అయినా ఆర్టీఐ చట్టంలోని అత్యంత కీలకమైన సెక్షన్ 8(1)(జే)ను సవరించాలని డిజిటల్ డాటా ప్రొటక్షన్ బిల్లు ప్రతిపాదించింది. దీనివల్ల ప్రజలెవరైనా ప్రభుత్వం నుంచి సమాచారం కోరితే, అది 'వ్యక్తిగత' సమాచారం అంటూ ప్రభుత్వ అధికారులు సమాచార విడుదల నిరాకరించవచ్చు. పౌరుల గోప్యత, వ్యక్తిగత సమాచారానికి ఆర్టీఐ చట్టం ఎన్నడూ భంగం కలిగించలేదని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. 'వ్యక్తిగత సమాచారం, గోప్యత' పేరుతో ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, డిజిటల్ డాటా ప్రొటక్షన్ బిల్లులోని పలు సెక్షన్లే ఇందుకు ఉదాహరణ అని కార్యకర్తలు వివరించారు.