Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు చేటు : 500మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు
న్యూఢిల్లీ : బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కార్ నిషేధం విధించటాన్ని భారత్‌కు చెందిన 500మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్ తీరు పౌర హక్కులను కాలరాస్తోందని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్ల ఘటనకు ప్రధాన బాధ్యుడు ఆనాటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోడీ..అని బీబీసీ డాక్యుమెంటరీ విశ్లేషించింది. రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీ రూపొందగా, వీటి ప్రసారాలు భారత్‌లో మోడీ సర్కార్ నిషేధించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆదివారం ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఐఐఎస్‌కు చెందిన అరిత్రా ఛటర్జీ, బిట్స్ పిలానీకి చెందిన కింజాల్ బెనర్జీ, కేంబ్రిడ్జ్ వర్సిటీకి చెందిన రోణాక్ సోని..మొదలైనవారు ఉన్నారు. డాక్యుమెంటరీ ప్రసారాలను అడ్డుకోవటం భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయటంగా వారు పేర్కొన్నారు. సమాజం, ప్రభుత్వానికి చెందిన ముఖ్య సమాచారం అందుబాటులో లేకుండా, దానిపై చర్చించకుండా చేయటమే మోడీ సర్కార్ లక్ష్యమని విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఆరోపించారు. ప్రకటనలో వారు పేర్కొన్న వివరాలు విధంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకునేందుకు పలు విశ్వవిద్యాలయాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కూడా సరైంది కాదు. ఇది విద్యా స్వేచ్ఛ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. సామాజిక, రాజకీయ సమస్యలపై బహిరంగ చర్చలను వర్సిటీలు ప్రోత్సహించాలి.
ప్రజాస్వామ్య సమాజం సక్రమంగా పనిచేయడానికి ఇలాంటి చర్చలు చాలా కీలకం. యూనివర్సిటీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అభిప్రాయాల వ్యక్తీకరణను అడ్డుకోవటం ఆమోదయోగ్యం కాదు.
జవాబుదారీ ఎవరు?
జవాబుదారీ ఎవరు వహిస్తారన్నది తేలకపోతే, దేశంలో మరిన్ని మత ఘర్షణలు చెలరేగే ప్రమాదముంది. మత ఘర్షణలు, మత విద్వేషాన్ని అడ్డుకోవాలంటే గుజరాత్ 2002 మారణకాండ బాధ్యులెవరన్నది తేలాలి. మత ఏకీకరణతో దేశాన్ని రెండుగా విభజించే శక్తుల్ని ఎదుర్కోవటం చాలా ముఖ్యం. మత ఘర్షణలకు జవాబుదారీ ఎవరు ? అని డాక్యుమెంటరీ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో బీబీసీ డాక్యుమెంటరీ లేవనెత్తిన ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. డాక్యుమెంటరీపై నిషేధం విధించటం ద్వారా బాధితుల గొంతును కేంద్రం అణచివేసింది. గుజరాత్ అల్లర్లపై విశ్వసనీయ సమాచారం అందుబాటులో ఉంది, ఆనాటి భయంకర ఘటనలపై సామాజిక, హక్కుల కార్యకర్తలు కీలక పత్రాలు విడుదల చేశారు. వీటిని చదవాలని బీబీసీ డాక్యుమెంటరీ చూసిన వీక్షకుల్ని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కోరారు.