Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2009నాటితో పోల్చితే పెరుగుదల 286 శాతం
- మొదటి..రెండు స్థానాల్లో బీజేపీ ఎంపీలు : ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : 2009 తర్వాత ఎంపీగా గెలిచినవారిలో 71 మంది ఆస్తులు, సంపదను పెద్ద మొత్తంలో పోగేసుకున్నారని 'అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్' (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఆస్తుల్లో సగటు పెరుగుదల 286శాతముందని నివేదిక పేర్కొంది. ఆస్తులు భారీ ఎత్తున పెంచుకున్న వారిలో బీజేపీ ఎంపీలు రమేశ్ చందప్ప, పి.సి.మోహన్ మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారని నివేదిక పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రమేశ్ చందప్ప ఆస్తులు 2009లో రూ.1.18కోట్లు. 2014నాటికి రూ.8.94 కోట్లు కాగా, 2019నాటికి తన ఆస్తులు రూ.50.14కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఈ గణాంకాల ప్రకారం ఆయన ఆస్తుల్లో పెరుగుదల 4189శాతముందని నివేదిక విశ్లేషించింది. కర్నాటకలోని బీజాపూర్ నియోజికవర్గం నుంచి ఎన్నికైన చందప్ప 2016-19 మధ్యకాలంలో కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆస్తుల్లో భారీ పెరుగుదల ఉన్న టాప్-10 ఎంపీల్లో కర్నాటకకు చెందిన మరో ఎంపీ పి.సి.మోహన్ రెండోస్థానంలో ఉన్నారు. బెంగుళూర్ సెంట్రల్ స్థానం నుంచి గెలుపొందిన ఆయన తనకు రూ.5.37 కోట్ల ఆస్తులున్నాయని 2009లో ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, 10ఏండ్లలో ఆస్తుల విలువ రూ.75.55కోట్లకు చేరుకుంది. ఆస్తులు, సంపద పెరుగుదల 1306శాతముందని నివేదిక అభిప్రాయపడింది. అలాగే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆస్తులు రూ.4.92 కోట్ల నుంచి రూ.60.32 కోట్లకు పెరిగింది. శిరోమణి అకాలీదళ్ ఎంపీ హరిసిమ్రత్ కౌర్ బాదల్ ఆస్తులు రూ.60.31 కోట్ల నుంచి రూ.218 కోట్లకు చేరుకుంది. ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే ఆస్తులు రూ.51 కోట్ల నుంచి రూ.140కోట్లకు పెరిగింది. ఇలా 71మంది ఎంపీల ఆస్తుల్లో సగటు పెరుగుదల 286శాతముందని ఏడీఆర్ విశ్లేషించింది.