Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మార్ట్‌మీటర్ల బిడ్‌ను రద్దు చేసిన యూపీ డిస్కమ్
- బిడ్ విలువ రూ.5400కోట్లు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, బడా కార్పొరేట్ గౌతం అదానీకి మరో షాక్ తగిలింది. స్మార్ట్‌మీటర్ల తయారీకి ఉద్దేశించి గౌతం అదానీ గ్రూప్ దాఖలు చేసిన బిడ్‌ను ఉత్తరప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ రద్దు చేసింది. 75లక్షల స్మార్ట్ మీటర్లను అందించేందుకు అదానీ కంపెనీ రూ.5400 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. అనివార్య కారణాల వల్ల ఈ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు మధ్వాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా మరోసారి బిడ్లను ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు విద్యుత్ పంపిణీ చేస్తున్న డిస్కమ్‌లు మొత్తం 2.5 కోట్ల స్మార్ట్‌మీటర్ల కోసం టెండర్లు ఆహ్వానించాయి. దాదాపు రూ.25వేల కోట్లను వెచ్చించి స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు యోగి సర్కార్ సిద్ధమవుతోంది. స్మార్ట్‌మీటర్ల టెండర్‌పై యూపీ విద్యుత్ వినియోగదారుల ఫోరం మండిపడుతోంది. దొడ్డిదారిన విద్యుత్ సంస్థలను ప్రయివేటుకు కట్టబెట్టే కుట్ర అని ఆరోపించింది.
మధ్వాంచల్, దక్షిణాంచల్, పూర్వాంచల్, పశ్చిమాంచల్..లలోని వివిధ డిస్కమ్‌లు స్మార్ట్ మీటర్లపై టెండర్ ప్రక్రియ చేపట్టాయి. అదానీ గ్రూప్ సహా జీఎంఆర్, ఎల్అండ్టీ, ఇంటెల్లీ, స్మార్ట్ ఇన్ఫ్రా కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఒక్కో స్మార్ట్‌మీటర్‌ను రూ.10వేలకు అందించేందుకు సిద్దమని అదానీ గ్రూప్ బిడ్ దాఖలు చేసింది. అయితే ఒక్కో స్మార్ట్‌మీటర్‌ను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.6వేలుగా పేర్కొంది. దీంతో పోలిస్తే అదానీ గ్రూప్ దాఖలు చేసిన మొత్తం చాలా అధికమని పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్స్ పేర్కొంది. ఈనేపథ్యంలో విద్యుత్ పంపిణీ సంస్థ మధ్వాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ మొత్తం టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. బిడ్లు దాఖలు చేసిన నాలుగు కంపెనీలకు ఇప్పటివరకు స్మార్ట్‌మీటర్లు తయారుచేసిన అనుభవం లేకపోవటం గమనార్హం. మిగిలిన డిస్కమ్‌లు సైతం ఇదే విధంగా బిడ్లను రద్దు చేసి, కొత్తగా టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశముందని వార్తలు వెలువడ్డాయి.