Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయిదాల పర్వంలో ఉభయ సభలు
న్యూఢిల్లీ : అదానీ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. హిండెన్‌బర్గ్ సంస్థ నివేదిక, అదానీ కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా మూడో రోజు పార్లమెంట్ స్తంభించింది. ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు మంగళ వారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే అదానీ కంపెనీ స్టాక్ మానిప్యులేషన్, దానివల్ల ఎల్ఐసీకి జరిగిన నష్టంపై చర్చిం చాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తిర స్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసం కాదనీ, ప్రజలు తమ సమస్యలను లేవనెత్తడానికి ఎంపీలను ఎన్నుకున్నారని అన్నారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో అదే గందరగోళం నెలకొంది. దీంతో సభ ఏడు నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ సభ ప్రారంభం కాగానే అదానీ కంపెనీ వల్ల ఎల్ఐసీ నష్టాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. వరుసగా మూడో రోజూ పార్లమెంట్లో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు.
అదానీ సర్కార్ డౌన్ డౌన్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ), సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 16 ప్రతిపక్షాలు సోమవారం ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడీ, బీఆర్ఎస్, ఎస్పీ, శివసేన, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్పీ, తదితర పార్టీల నేతలు ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, బిలియనీర్‌కు మధ్య ''యారీ'' (స్నేహం) అని నినాదాలు చేశారు. ''ఎస్బీఐ, ఎల్ఐసీ వల్ల పెద్దమొత్తంలో ప్రజాధనం అదానీ గ్రూప్‌లో లాక్ చేయబడింది'' అని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. అంతకు ముందు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీడిఎంకె, ఎన్‌సిపి, బిఆర్ఎస్, జెడియు, ఎస్పి, సిపిఎం, సిపిఐ, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), జెఎంఎం, ఆర్ఎల్డి, ఆర్ఎస్పి, ఆప్, ఐయుఎంఎల్, ఆర్జెడి, శివసేన నేతలు పాల్గొన్నారు.
'రాష్ట్రపతి ప్రసంగం చర్చకు తగిన ప్రాముఖ్యత ఉంది, కానీ...': అదానీ సమస్యపై ఖర్గే
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అదానీ సమస్యపై చర్చ గురించి మాట్లాడుతూ ''మేము మా నోటీసులపై (పార్లమెంటులో) చర్చకు డిమాండ్ చేస్తున్నాం. మేము వివరమైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. ముందుగా దానిని చేపట్టాలని మేము కోరుతున్నాం. మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రపతి ప్రసంగంపై మేము దానికి తగిన ప్రాముఖ్యతనిస్తాము. అయితే ఈ సమస్యపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వడమే మొదటి ప్రాధాన్యత'' అని పేర్కొన్నారు.
'ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయి'
అదానీ సమస్యపై పార్లమెంట్లో ప్రతిపక్షాల వ్యూహాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అదిర్ రంజన్ చౌదరి ప్రస్తావిస్తూ ''మేము ఇప్పుడు సమావేశం అయ్యాం, మొత్తం ప్రతిపక్షాలు కలిసి, చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇది కాంగ్రెస్ సమస్య కాదు. దేశంలోని సాధారణ ప్రజల సొమ్ముకు సంబందించినది'' అని అన్నారు.