Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సంబంధాలను బయటపెట్టాలి
- లోక్‌సభలో రాహుల్ గాంధీ ఫోటో ప్రదర్శన
- రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అదానీతో మోడీకి ఉన్న సంబంధాలను బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకే ఒక్క వ్యాపారవేత్త పేరు వినిపించిందనీ, అది అదానీదేనని అన్నారు. మోడీ-అదానీ కలిసి ఉన్న ఓ ఫొటోను లోక్‌సభలో ప్రదర్శించటంతో లోక్‌సభ వేడెక్కింది. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడ చూసినా అదానీ, అదానీ, అదానీ గురించే అడిగారని వివరించారు. ''అదానీ ఏ వ్యాపారంలోకి అయినా ప్రవేశిస్తారు. ఆయన ఎన్నడూ విఫలమవరు'' అని ప్రజలు తనతో చెప్పారన్నారు. ప్రతి వ్యాపారంలోనూ ఆయన ఏ విధంగా విజయం సాధిస్తున్నారు? ఎన్నడూ ఎందుకు విఫలమవడం లేదు? ఏమిటి ఆ మాయాజాలం? ఏమిటి ఈ సంబంధం? అని వారు తనను అడిగారన్నారు. మోడీ, అదానీ ఓ విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపించే ఫొటోను ఆయన ప్రదర్శించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకునీ, ఇటువంటి పోస్టర్లు సభ గౌరవానికి తగినవి కాదన్నారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ఇది కేవలం ఓ ఫొటో అనీ, పోస్టర్ కాదని అన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విషయంలో రాజకీయాలు చేస్తున్నారని మోడీ ఆరోపించారనీ, అయితే అదానీకి కాంట్రాక్టులు ఇచ్చారనేది నిజమని పేర్కొన్నారు.
రక్షణరంగంలో అనుభవంలేకపోయినా...
రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేకపోయినా నాలుగు డిఫెన్స్ కాంట్రాక్టులను అప్పగించారన్నారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదనీ, హెచ్ఏఎల్ వాటిని తయారు చేసిందని చెప్పారు. మోడీ ఇజ్రాయెల్ వెళ్లిన తరువాతే.. అదానీకి ఆ కాంట్రాక్టు దక్కిందని అన్నారు.
నాడు అదానీ విమానంలో..నేడు మోడీ విమానంలో...
ఒకప్పుడు అదానీ విమానంలో మోడీ ప్రయాణించేవారనీ, ఇప్పుడు మోడీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం అంతకు ముందు గుజరాత్‌కు సంబంధించినదనీ, ఆ తరువాత భారత దేశానికి సంబంధించినది అయిందనీ, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని అన్నారు. గడచిన ఇరవయ్యేండ్లలో బీజేపీకి అదానీ ఎంత విరాళాల రూపంలో ఇచ్చారనీ, ఎలక్టొరల్ బాండ్ల ద్వారా ఎంత ముట్టజెప్పారని నిలదీశారు.
శ్రీలంకలోనూ..
2022లో శ్రీలంక పార్లమెంటరీ కమిటీతో ఆ దేశ విద్యుత్తు బోర్డు చైర్మెన్ మాట్లాడుతూ విండ్ పవర్ ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని ప్రధాని మోడీ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్స చెప్పినట్టు తెలిపారన్నారు. ఇది మన దేశ విదేశాంగ విధానం కాదనీ, ఇది కేవలం అదానీ వ్యాపారం కోసం విధానమని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా వెళ్తారనీ, మాయ చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీకి 1 బిలియన్ డాలర్లు రుణం ఇస్తుందని అన్నారు. ఆ తరువాత మోడీ బంగ్లాదేశ్ వెళ్తారనీ, అదానీతో బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ 25 ఏండ్ల కాంట్రాక్టు కుదుర్చుకుంటుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ ఆలోచనతోనే అగ్నివీరులు..
అగ్నివీరుల నియామక పథకం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్) ఆలోచనల నుంచి వచ్చిందని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు తనతో చెప్పారన్నారు. ఆయుధాలను ఉపయోగించడంలో వేలాది మందికి శిక్షణ ఇస్తున్నామని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో వారు సాధారణ పౌరులుగా సమాజంలోకి వస్తున్నారని వారు తనకు చెప్పారన్నారు. ఈ ఆలోచన వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారని కూడా వారు చెప్పారన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో లేవన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజలు తనకు చెప్పిన సమస్యలేవీ ఈ ప్రసంగంలో కనిపించలేదన్నారు.
అదానీ అంశంపై అట్టుడికిన రాజ్యసభ...
ప్రతిపక్షాల వాకౌట్
అదానీ వ్యవహారం చర్చకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోడాన్ని రాజ్యసభ అట్టుడికింది. మోడీ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో 16 ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. ఆప్, బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ పార్లమెంట్ వ్యవహారాల్లో పాల్గొనడానికి అంగీకరించాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యునైటెడ్), సీపీఐ(ఎం), సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కేరళ కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. దీంతో ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.
లోక్‌సభలో సతీ సహగమన వ్యాఖ్యలపై దుమారం
లోక్‌సభలో సతీ సహగమన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చను చేపట్టారు. బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్ జోషి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీ సహగమనం ఆచారాన్ని కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఆ సమయంలో డీఎంకే ఎంపీ ఎ రాజా, సిపి జోషి కుర్చీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.
బడ్జెట్లో కేరళకు అన్యాయం
- సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీల ధర్నా
కేంద్ర బడ్జెట్లో కేరళకు అన్యాయం జరిగిందని సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీలు ధర్నా చేపట్టారు. పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వామపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హౌరెత్తించారు. కేరళ పట్ల వివక్షత తగదని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం విమర్శించారు.