Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార సబ్సిడీకి మోడీ సర్కార్ భారీగా కోతలు
- కేటాయింపులు రూ.72వేల కోట్ల నుంచి రూ.59వేల కోట్లకు తగ్గింపు
- రేషన్ బియ్యం, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు ఆహార పంపిణీపై ప్రభావం
- రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : రాష్ట్రాలపై కక్ష గట్టిందా? అనేట్టు కేంద్ర బడ్జెట్ 2023-24కు మోడీ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందులో పేర్కొన్న గణాంకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, పన్నుల వాటా, అప్పుల సేకరణ..ఇలా ఏ విభాగం తీసుకున్నా..రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బతీయటమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ సాగింది. రాష్ట్రాలు ప్రతి విషయంలో కేంద్రాన్ని వేడుకునేలా, అభ్యర్థించేలా చేయటమే మోడీ సర్కార్ వ్యూహంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆహార సబ్సిడీకి భారీగా కోతలు విధించి..తద్వారా రాష్ట్రాలను టార్గెట్ చేసిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
సవరించిన అంచనాల ప్రకారం 2022-23లో ఆహార సబ్సిడీకి కేటాయింపులు రూ.72,282 కోట్లు. దీనిని మరింత పెంచుతారని ఎవరైనా ఆశిస్తారు. కానీ మోడీ సర్కార్ కొత్త బడ్జెట్లో ఆహార సబ్సిడీకి నిధుల్ని రూ.59వేల కోట్లకు తగ్గించింది. దీంతో రేషన్ సరుకుల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఆహార ఉత్పత్తుల సేకరణ రాష్ట్రాలకు పెను భారంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సేకరణ..పంపిణీ అంతా రాష్ట్రాల వద్దే
మధ్యాహ్న భోజన పథకం, రేషన్ సరుకుల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలకు ఆహార పదార్థాలు..మొదలైన సంక్షేమ కార్యక్రమాల అమలు రాష్ట్రాలపై ఉంది. ఇందుకోసం ప్రతిఏటా 'సెంట్రల్ పూల్' కింద ఆహార ఉత్పత్తుల సేకరణ చేపడుతున్నాయి. రక్తహీనత, పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని వర్గాలకు పోషక విలువలున్న బియ్యం పంపిణీ కూడా రాష్ట్రాల ద్వారానే అమలవుతోంది. వీటి కోసం జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 కింద రాష్ట్రాలకు సరిపడా నిధుల్ని కేంద్రం కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో వివిధ ఏజెన్సీలు చేపట్టే సేకరణ పద్ధతిని 'వికేంద్రీకృత సేకరణ విధానం' (డీసీపీ)గా పేర్కొంటారు. ఈ డీసీపీ విధానంలో సేకరించే వాటికే కొత్త బడ్జెట్లో మోడీ సర్కార్ నిధుల్ని కోతపెట్టింది.
నిధుల రాక అనుమానం!
నిధుల కేటాయింపు తగ్గిపోవటం వల్ల కేంద్రం నుంచి నిధుల రాక అంతంత మాత్రంగా ఉండబోతోంది. అప్పుడు రాష్ట్రాల ఆహార ధాన్యాల సేకరణ దెబ్బతినే ప్రమాదముంది. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, 'డీసీపీ' కేటగిరి కింద 15 రాష్ట్రాలున్నాయి. తెలంగాణ, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్..తదితర రాష్ట్రాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బియ్యం సేకరణ లక్ష్యం 434 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 43శాతం (189 లక్షల మెట్రిక్ టన్నులు) సేకరణ ఈ 15 రాష్ట్రాల నుంచి (జనవరి 23నాటికి) జరిగింది. ఇలా సేకరించిన ఆహార ఉత్పత్తుల్ని రాష్ట్రాలు రేషన్ సరుకుల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలకు పంపుతాయి. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాయి. మిగిలిన ఆహార నిల్వల్ని 'సెంట్రల్ పూల్' కింద ఎఫ్సీఐ స్వాధీనం చేసుకుంటుంది.
అవసరం చూసి ఇస్తాం : కేంద్రం
రాష్ట్రాల అవసరం మేరకు నిధుల కేటాయింపు పెంచుతామని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలోని అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. నిధుల కేటాయింపుపై సమీక్ష జరిపి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అవసరం మేరకు నిధుల కేటాయింపు చేపడుతుందని చెప్పారు. డీసీపీ-గోధుమ సేకరణ కేటగిరిలో మొత్తం 8 రాష్ట్రాలున్నాయి. కొత్త బడ్జెట్లో నిధుల కోత ప్రభావం మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలపై పడనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 187 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ సేకరణ నమోదుకాగా, డీసీపీ రాష్ట్రాల వాటా 75 శాతం (142 లక్షల మెట్రిక్ టన్నులు)గా ఉంది. డీసీపీ కేటగిరిలో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే ఆహార సబ్సిడీలో కేంద్రం కోతలు పెట్టడాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. రేషన్ పంపిణీ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతుందని ఇప్పటికే లేఖలు కూడా పంపాయి.